
చతికిలబడి
స్వచ్ఛ విశాఖ
4
డాబాగార్డెన్స్ : స్వచ్ఛ సర్వేక్షణ్–2024లో మొత్తం 12,500 మార్కులకు పోటీ నిర్వహించారు. డోర్ టు డోర్ చెత్త సేకరణ, విభజన, చెత్తను సంపదగా మార్చడం, మార్కెట్లు, రోడ్లు, జనావాసాలు, ప్రజా మరుగుదొడ్లు, కాలువలు శుభ్రంగా ఉంచడానికి సంబంధించి 10,000 మార్కులు కేటాయించారు. అలాగే డంపింగ్ యార్డులో చెత్త నిల్వలు లేకుండా చూడటం, బహిరంగ మల విసర్జన నిర్మూలించడం,మురుగునీటిని శుద్ధి చేసి పునర్వినియోగానికి వాడడం వంటి వాటికి 2,500 మార్కులు కేటాయించారు. అయితే స్వచ్ఛ సర్వేక్షణ్–2024లో జీవీఎంసీ 11,636 మార్కులు మాత్రమే సాధించింది. కాపులుప్పాడ డంపింగ్ యార్డులో బయోమైనింగ్ ద్వారా చెత్తను పూర్తిగా నిర్మూలించడంలో విఫలమైంది. 2025 జనవరి నాటికి యార్డ్‌లో చెత్త లేకుండా చూడాల్సి ఉండగా, దాదాపు 20 శాతానికి పైగా చెత్త ఇంకా పేరుకుపోయి ఉండటంతో ‘గార్బేజ్ ఫ్రీ సిటీ’ కేటగిరీలో రేటింగ్ కోల్పోయింది. ఈ కేటగిరీలో ఫైవ్ స్టార్ ర్యాంకు సర్టిఫికెట్‌ను మాత్రమే కేంద్రం జారీ చేసింది.
పాలన మారగానే పతనం
రాష్ట్రంలో పాలన మారిన వెంటనే పరిస్థితి తలకిందులైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీవీఎంసీకి ఐదారు నెలలుగా పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించకపోవడంతో పాలన పూర్తిగా గాడితప్పింది. పాలకుల పర్యవేక్షణ కొరవడటంతో అధికారుల్లో ఉదాసీనత, క్షేత్రస్థాయి సిబ్బందిలో అలసత్వం పెరిగిపోయాయి. ఫలితంగా నగరంలో ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త కుప్పలు, అధ్వానంగా మారిన ప్రజా మరుగుదొడ్లు, నిర్వహణకు నోచుకోని డంపింగ్ యార్డ్.. ఇవన్నీ కలిసి విశాఖ స్వచ్ఛ కీర్తిని మసకబార్చాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో జరిగిన రోడ్ల విస్తరణ, జంక్షన్ల ఆధునికీకరణ, తాగునీటి ప్రాజెక్టులు, పట్టణ పేదల జీవన ప్రమాణాల మెరుగుదల వంటి అభివృద్ధి కార్యక్రమాలతో కళకళలాడిన విశాఖ.. నేడు ఈ పరిస్థితికి చేరడం కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాడు 4వ ర్యాంకు..
నేడు 9వ ర్యాంకుకు పతనం
పాలకుల పట్టింపులేకే..
పారిశుధ్యంలో వెనక్కి..
కూటమి అసమర్థ పాలనకు
ఇదే నిదర్శనమంటున్న నగర ప్రజలు
స్వచ్ఛ సర్వేక్షణ్–2024లో జీవీఎంసీ ర్యాంకు దిగజారింది. పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల కేటగిరీలో గత రెండేళ్లుగా టాప్–4 ర్యాంకుతో వెలిగిన విశాఖ కీర్తి.. కూటమి ప్రభుత్వ హయాంలో 9వ ర్యాంకుకు పడిపోయింది. ఇది కేవలం ర్యాంకులపట్టికలో అంకెల పతనం కాదు.. నగర పాలనపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, తీవ్ర నిర్లక్ష్యానికి నిలువుటద్దమని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.క్షేత్రస్థాయిలో పారిశుధ్యం క్షీణించడం, సిటిజన్ ఫీడ్‌బ్యాక్ లేకపోవడం, డంపింగ్‌యార్డ్‌లో చెత్త రీసైక్లింగ్, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడమే ఈ ర్యాంకు పతనానికి ప్రధాన కారణాలని స్పష్టమవుతోంది.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ‘స్వచ్ఛ సంకల్పం’, ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్(క్లాప్)’వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో విశాఖ నగరం పారిశుధ్య నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇంటింటికీ ఉచితంగా చెత్త బుట్టలు అందించారు. తడి–పొడి చెత్త విభజనపై అవగాహన కల్పించారు. వాహనాల ద్వారా పారిశుధ్య కార్మికులు ప్రజల నుంచి చెత్త సేకరించే విధానాన్ని అమలు చేశారు. మరీ ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు ‘ఎకో క్లీన్’, ‘ఎకో గ్రీన్’, ‘ఎకో బ్లూ’, ‘ఎకో జీరో ప్లాస్టిక్’, ‘ఎకో జీరో పొల్యూషన్’ పేరిట ‘ఎకో వైజాగ్’ప్రారంభించారు. ‘ఎకో గ్రీన్’ కింద చెట్ల పెంపకం, కమ్యూనిటీ గార్డెనింగ్ వంటి వాటితో పచ్చని నగరంగా తీర్చిదిద్దారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత ఉత్పత్తులను ప్రోత్సహించారు. తద్వారా జీవీఎంసీ వరుసగా 2022, 2023 సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకును కై వసం చేసుకుంది.