
జనసేన కార్పొరేటర్ వేధింపులు
● పీతల మూర్తి యాదవ్ తమ పొట్టకొడుతున్నారు. ● న్యాయం చేయాలని జీవీఎంసీ కమిషనర్‌కు 22వ వార్డు ఆర్పీల వేడుకోలు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి తమ పొట్టలు కొడుతున్నారని ఆర్పీలు చంద్రకళ, జానకి వాపోయారు. కార్పొరేటర్ తీరును నిరసిస్తూ శుక్రవారం వార్డు పరిధిలోని పిఠాపురంకాలనీ నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చారు. జీవీఎంసీ సమీపంలోని ఓ హోటల్‌లో కార్పొరేటర్ పీతల మూర్తి ఉన్నారని తెలిసి, వారు గ్రూపు సభ్యులతో కలిసి ఆ హోటల్‌ను ముట్టడించారు. పోలీసులు రంగంలోకి దిగి, ఈ విషయాన్ని జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించడంతో వెనుదిరిగారు. అనంతరం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ పేషీ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్పీలు మీడియాతో మాట్లాడుతూ గత ఏడేళ్లుగా 22వ వార్డులో సభ్యులను చైతన్య పరుస్తూ.. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్పొరేటర్‌గా పీతల మూర్తి వచ్చిన నాటి నుంచి తమను అనేక రకాలుగా వేధిస్తున్నారని ఆరోపించారు. అతనికి అనుకూలంగా లేమంటూ.. వార్డులో ఉన్న ఐదుగురు ఆర్పీల్లో ఇద్దరిని తొలగించమని పీతల మూర్తి యూసీడీ పీడీ సత్యవేణిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారన్నారు. ఆమైపె కేకలు వేస్తూ తమను తొలగించాలని ఒత్తిడి చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. కాంట్రాక్ట్ పద్ధతిలో నెలకు రూ.8 వేల జీతంతో పనిచేస్తున్నామని, ఎనిమిది నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదని వాపోయారు. జీవీఎంసీ కమిషనర్, మెప్మా ఎండీ స్పందించి మూర్తి యాదవ్ వేధింపులు ఆపి, తమకు న్యాయం చేయాలని కోరారు. లేకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.