
కేకే లైన్‌లో 3 అంచెల రక్షణ వ్యవస్థ
● కొండచరియల సమస్యకు శాశ్వత పరిష్కారం ● రూ.కోట్ల నష్టాన్ని నివారించేందుకు వాల్తేరు డివిజన్ నిర్ణయం ● త్వరలోనే టెండర్లకు ఆహ్వానం
సాక్షి, విశాఖపట్నం: కేకేలైన్‌లో కొండచరియల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఈ మార్గంలో తరచుగా కొండచరియలు విరిగిపడి రైల్వే ట్రాక్ దెబ్బతింటున్న నేపథ్యంలో, దీనికి చెక్ పెట్టేందుకు మూడు అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే టెండర్లు ఆహ్వానించేందుకు సన్నద్ధమవుతున్నారు.
కొత్తవలస–కిరండూల్ లైన్.. కొండల మధ్యలో ఏర్పాటు చేసిన ఎత్తైన రైల్వే ట్రాక్ ఇది. దీన్నే కేకే లైన్ అని పిలుస్తారు. సరకు రవాణా కోసం ఈ లైన్‌ను వినియోగిస్తుండగా.. చిన్నపాటి వర్షం కురిసినా.. కొండచరియలు విరిగి ట్రాక్‌పై పడుతున్నాయి. ఏటా 5 నుంచి 10 సార్లు ఇదే పరిస్థితి నెలకొంటుంది. ప్రతిసారి ట్రాక్ పునరుద్ధరణ పనులకు వాల్తేరు రైల్వే డివిజన్ లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఆ సమయంలో రైళ్ల రాకపోకలు 2 నుంచి 3 రోజుల పాటు నిలిచిపోతున్నాయి. ఈ కారణంగా వాల్తేరు డివిజన్‌కు రూ.కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది. కేకే లైన్ నిర్మించినప్పటి నుంచి కొండచరియలు విరిగిపడటం, రైళ్లు రద్దు చేయడం, మార్గంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టడం అనేది నిరంతర ప్రక్రియగా మారింది. ఈ నేపథ్యంలో తరచూ కొండ చరియలు విరిగిపడుతున్న ప్రాంతాలను గుర్తించి.. రక్షణ చర్యలు చేపట్టాలని తాజాగా రైల్వే అధికారులు నిర్ణయించారు.
మూడు లేయర్లతో రక్షణ వ్యవస్థ
కొత్తవలస–కిరండూల్ మార్గంలో ఎక్కడెక్కడ, ఎన్నిసార్లు కొండచరియలు విరిగిపడ్డాయో వాల్తేరు రైల్వే అధికారులు గణాంకాలు సేకరిస్తున్నారు. ఈ సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత, తరచుగా కొండచరియలు విరిగిపడి ట్రాక్ దెబ్బతింటున్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించనున్నారు. ఈ అంశంపై డీఆర్‌ఎం లలిత్ బోహ్రా ఇటీవల సమీక్ష నిర్వహించారు. కేకే లైన్‌లోని ఇబ్బందులపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మూడు అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వ్యవస్థలో భాగంగా కొండల వెంబడి భారీ మెష్‌ను ఏర్పాటు చేస్తారు. అలాగే కట్ స్లోప్‌లలో స్టీల్ వైర్ మెష్ ప్రొటెక్షన్, స్టీల్ బౌల్డర్ నెట్, రాక్‌ఫాల్ బారియర్లను పెడతారు. సుమారు 1,500 కిలోల సామర్థ్యంతో ఈ రాక్‌ఫాల్ బారియర్లను అమర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇవి కాకుండా పలు ప్రాంతాల్లో రీన్‌ఫోర్స్‌డ్ గేబియన్ బ్లాక్స్, రాక్‌షెడ్‌లను ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా వాల్తేరు అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఈ రాక్‌ఫాల్ బారియర్స్ కొండచరియలు ట్రాక్‌పై పడకుండా దాదాపు పూర్తిగా నిరోధిస్తాయి. ఒకవేళ ఈ బారియర్ల సామర్థ్యాన్ని మించి భారీ బండరాళ్లు పడినా, అవి ట్రాక్‌ను పూర్తిస్థాయిలో దెబ్బతీయకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల పునరుద్ధరణ పనులను గంటల వ్యవధిలో పూర్తి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.
రాక్‌ఫాల్ బారియర్స్ ఏర్పాటు ఇలా..

కేకే లైన్‌లో 3 అంచెల రక్షణ వ్యవస్థ