
ఎస్సీల అభ్యున్నతికి కృషి చేయాలి
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్
మద్దిలపాలెం: అధికార యంత్రాంగం ఎస్సీల అభ్యున్నతికి కృషి చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ కోరారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ సమావేశ మందిరంలో ఎస్సీల సంక్షేమం, అభివృద్ధిపై జిల్లా యంత్రాంగం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమీక్షించారు. జిల్లాలో ఉన్న 44 శాఖల అధికారులు ఎస్సీలకు మేలు చేసే దిశలో పని చేయాలన్నారు. ప్రధాని మోదీ ఎస్సీల కోసం ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 5 కోట్ల వరకు 50 శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తున్నారన్నారు. బ్యాంకర్లు, అధికారులు ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. ముందుగా కలెక్టర్ హరేందిర ప్రసాద్ జిల్లాలో ఎస్సీలకు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వసతి గృహాలు, పాఠశాలల వివరాలను వివరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, తీసుకుంటున్న చర్యలను సీపీ శంఖ బ్రత బాగ్చి వివరించారు. ఎస్సీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ జి.సునీల్‌కుమార్ బాబు, డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, డీఆర్వో భవానీ శంకర్, సాంఘిక సంక్షేమ ఉప సంచాలకుడు రామారావు, కమిషన్ అధికారులు నవీన్, వరప్రసాద్, క్రాంతి కుమార్ పాల్గొన్నారు.
ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ అమలు చేయాలి
మల్కాపురం : హెచ్‌పీసీఎల్ ఉద్యోగ నియామకాల్లో 15 శాతం రిజర్వేషన్ ప్రక్రియను పక్కాగా అమలు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం హెచ్‌పీసీఎల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సంస్థలోని వివిధ విభాగాల పనితీరును ప్రాజెక్ట్ ద్వారా ఉన్నతా ధికారులు వివరించారు. తర్వాత ఉన్నతాధికారులు, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రామచందర్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎం.ఎస్.ఎం.ఈ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరగకుండా చూడాలని, విద్యార్థుల పుస్తకాల పంపిణీ కోసం గతంలో కేటాయించే రూ. 12 లక్షల నిధులను పునరుద్ధరించాలని సంస్థ ఈడీ, సీజీఎంలను ఆయన ఆదేశించారు.