
కూటమి ‘మాస్టర్‌ప్లాన్’
● సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఇచ్చిన వారంతా కూటమి నేతలే.. ● వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్–2041 పునఃపరిశీలనలో గూడుపుఠాణి ● ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు కలరింగ్ ● చాలా ప్రాంతాల్లో ప్రతిపాదిత రహదారులు కుదించాలని కూటమి విజ్ఞప్తులు ● ఇష్టానుసారంగా బృహత్ ప్రణాళికలో సవరణలకు ఎత్తుగడ
విశాఖ సిటీ : సలహాలు ఇచ్చేది వాళ్లే. సూచనలు చేసేది వాళ్లే. అభ్యంతరాలు తెలిపేది వాళ్లే. సవరణలను ప్రతిపాదించేది వాళ్లే. నాలుగు గోడల మధ్య ఏసీ సమావేశ మందిరంలో కూటమి ‘మాస్టర్ ప్లాన్’ వేస్తోంది. వీఎంఆర్‌డీఏ బృహత్ ప్రణాళిక–2041లో ఇష్టానుసార సవరణలకు గూడుపుఠాణి చేస్తోంది. అయిపోయిన పెళ్లికి మళ్లీ బాజాలు అన్నట్లు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సిద్ధమైన మాస్టర్‌ప్లాన్ పునఃపరిశీలనకు కూటమి ప్రభుత్వం పూనుకుంది. శాసీ్త్రయంగా జరగాల్సిన ప్రక్రియను కూటమి నేతల సమక్షంలోనే మమా అనిపించేయాలని చూస్తోంది. అందుకు బుధవారం వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో జరిగిన తంతే నిదర్శనం. మాస్టర్‌ప్లాన్‌పై అభ్యంతరాలు ఉంటే వీఎంఆర్‌డీఏ మూడో అంతస్తులో ఉన్న సమావేశ మందిరానికి వచ్చి చైర్‌పర్సన్ ప్రణవ్‌గోపాల్, కమిషనర్ విశ్వనాథన్‌కు తెలియజేయాలని ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమంలో కూటమి ప్రజాప్రతినిధులు, నేతలు, వారి అనుచరుల హడావుడే కనిపించింది. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పి.. కూటమి ప్రజాప్రతినిధులు, నేతల రియల్ వ్యాపారాలకు లబ్ధి చేకూరేలా ఇష్టానుసారంగా మార్పులు, చేర్పులకు ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రహదారులను విస్తరించడానికి మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేస్తుంటారు. కానీ ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ రహదారులను కుదించడానికి ఎక్కువగా విజ్ఞప్తులు రావడం గమనార్హం. భవిష్యత్తులో అవసరమైన ప్రాంతాల్లో రహదారులను కుదించాలని, వ్యాపారాలకు అనువైన ప్రాంతాల్లో విస్తరణకు ప్రతిపాదించడం ఇక్కడ విశేషం. వారే సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తెలుపుతూ సవరణలకు చేయాలని అధికారులకు వినతులు అందజేశారు. ఈ బృహత్ ప్రణాళికపై సలహాలు, సూచనల స్వీకరణకు అనూహ్య స్పందన వచ్చిందని చెప్పడం కొసమెరుపు.
కూటమి చేసిన వినతులు
● రుషికొండ సర్వే నెంబర్ 25లో ఏ1 గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ప్రతిపాదిత 60 మీటర్ల రహదారిని, డివైడర్ నుంచి ఇరువైపులా 30 మీటర్లు ఉండే విధంగా మాత్రమే అలైన్మెంట్ ఉండాలి.
● దసపల్లా హిల్స్ సర్వే నెంబర్ 1196లో నౌరోజీ రోడ్ నుంచి వాల్తేరు మెయిన్ రోడ్డుకు కలిపే రహదారి విస్తరణ ప్రస్తుతం నిలిపివేయాలి.
● నిడిగట్టు గ్రామంలో ప్రతిపాదిత 24 మీటర్ల రహదారి నిర్మాణం వద్దు.
● నేరేళ్ల వలస రెవెన్యూ గ్రామంలో ఎస్‌ఓఎస్ వద్ద ప్రతిపాదిత 70 మీటర్ల రహదారి అలైన్మెంట్‌ను మార్పు చేయాలి.
● సర్వే నెంబర్ 101(రుషికొండ)లో 33 అడుగుల ప్రతిపాదిత గ్రీన్ బెల్ట్‌ను తొలగించాలి.
● మధురవాడ సర్వే నెంబర్ 374/1, ఎల్‌పీ నెంబర్ 74/88 లో ప్రతిపాదిత 60 అడుగులు రహదారి స్థానంలో 40 అడుగుల రహదారిని కొనసాగించాలి.
● హనుమంతువాక నుంచి జోడుగుళ్లపాలెం వరకు ప్రతిపాదిత 100 అడుగుల రహదారిని 60 అడుగులకు పరిమితం చేయాలి.
● అక్కయ్యపాలెం మెయిన్ రోడ్డు నుంచి రైల్వే న్యూ కాలనీ వరకు గల ప్రతిపాదిత 100 అడుగుల రహదారిని 60 అడుగులకు కుదించాలి.
● సర్వే నెంబర్ 76/5 గుడిలోవ పరిధిని ఎకో జోన్ నుంచి నివాస జోన్‌గా మార్పు చేయాలి.
● లంకెలపాలెం నుంచి షీలానగర్ వరకు ప్రతిపాదించిన 80మీ రహదారి స్థానంలో 60 మీ రహదారిని కొనసాగించాలి.
● స్థానిక భూలోకమాత ఆలయం వద్ద రహదారి విస్తరణ ప్రతిపాదనను విరమించుకోవాలి.
● విజయనగరం, వీటీ అగ్రహారం, సర్వే నెంబర్ 115, 116 మీదుగా ప్రతిపాదించిన 60 అడుగుల రహదారి తొలగించాలి.
● మధురవాడ వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ పక్కన ప్రస్తుతమున్న 60 అడుగుల రహదారిని 100 అడుగుల వెడల్పు రహదారిగా చేసిన ప్రతిపాదనలను పునఃపరిశీలించాలి.