
ప్రజలకు ఇబ్బంది లేకుండా మెట్రో స్టేషన్లు
● ప్రభుత్వ స్థలాలనే ఉపయోగించాలి ● భూసేకరణపై ప్రజాభిప్రాయంలో పలువురి సూచనలు
గాజువాక: నగరంలో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజక్టు నిర్మాణం కోసం భూసేకరణలో భూమి కోల్పోయినవారికి ఇబ్బంది లేకుండా చూడాలని పలువురు పేర్కొన్నారు. మొదటి దశలో చేపట్టనున్న భూసేకరణపై బుధవారం గాజువాకలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రో ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుధాసాగర్ మాట్లాడుతూ కూర్మన్నపాలెం నుంచి కొమ్మాది వరకు మెట్రో ప్రాజెక్టు కోసం 97 ఎకరాల భూమి అవసరమవుతుందన్నారు. ఇందులో 87 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఇంకా 9.22 ఎకరాలను పట్టా భూమి నుంచి సేకరించాల్సి ఉందన్నారు. ఈ సేకరణలో 312 ఇళ్లు, వ్యాపార సంస్థలు, ఖాళీస్థలాలకు నష్టం జరగుతుందన్నారు. కారిడార్–1లో 94 నివాస, వ్యాపార, ఖాళీ స్థలాలకు కొద్ది గాను, 20 ఇళ్లకు పూర్తి గానూ నష్టం జరుగుతుందన్నారు. వారికి 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్ట పరిహారం అందజేస్తామన్నారు. అలాగే గాజువాక, గోపాలపట్నం, గురుద్వారా, సంపత్ వినాయకనగర్, పూర్ణామార్కెట్, మధురవాడ ప్రాంతాల్లో అభిప్రాయ సేకరణ సదస్సులు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కాగా..నిర్వాసితులు స్టేషన్ పాయింట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రతి కిలోమీటర్‌కు ఒక స్టేషన్ కాకుండా స్టేషన్‌కు, స్టేషన్‌కు మధ్య రెండు కిలోమీటర్లకు పైన దూరం ఉండేటట్టు చూడా లని కోరారు. మెట్రో స్టేషన్లను ప్రైవేట్ స్థలాల్లో కాకుండా ప్రభుత్వ స్థలాలున్న చోట ఏర్పాటు చేయాలని సూచించారు. దీని వల్ల ప్రభుత్వానికి వ్యయం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. అభ్యంతరాలను రికార్డు చేసిన ఎస్‌డీసీ వాటిని కలెక్టర్‌కు నివేదిస్తామని తెలిపారు. కార్యక్రమంలో 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, తహసీల్దార్ బి.శ్రీనివాసరావు, మెట్రో నిపుణులు దేవరాజు, మాధవరెడ్డి, మెట్రో డిప్యూటీ తహసీల్దార్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.