
కోరాపుట్ వరకే కిరండూల్ రైళ్లు
తాటిచెట్లపాలెం : విశాఖపట్నం–కిరండూల్ రైళ్లు భద్రతా పనుల నిమిత్తం ఆయా తేదీల్లో కోరాపుట్ వరకు మాత్రమే రాకపోకలు సాగిస్తాయని వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఈ నెల 17, 18వ తేదీల్లో విశాఖపట్నం–కిరండూల్ (58501) పాసింజర్ కోరాపుట్ స్టేషన్ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 17, 18వ తేదీల్లో కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్ కిరండూల్ నుంచి కాకుండా కోరాపుట్ నుంచి బయల్దేరి విశాఖపట్నం చేరుకుంటుంది. అలాగే ఈ నెల 17, 18వ తేదీల్లో విశాఖపట్నం–కిరండూల్(18515) నైట్ ఎక్స్‌ప్రెస్ కోరాపుట్ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు కిరండూల్– విశాఖపట్నం(18516) నైట్ ఎక్స్‌ప్రెస్ కిరండూల్ నుంచి కాకుండా కోరాపుట్ నుంచి బయల్దేరి విశాఖపట్నం చేరుకుంటుంది.
రక్షణ మంత్రి పర్యటన రద్దు
విశాఖ సిటీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విశాఖ పర్యటన రద్దయింది. వాస్తవానికి గురు, శుక్రవారాల్లో ఆయన నగర పర్యటన ఖరారైంది. ఈ నెల 18న నేవల్ డాక్‌యార్డులో జరగనున్న నిస్తార్ నౌక జల ప్రవేశ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల విశాఖ పర్యటన రద్దయినట్లు అధికారులకు సమాచారం అందింది.
నేడు రక్షణ శాఖ సహాయ మంత్రి రాక
కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ గురువారం విశాఖ రానున్నారు. రాత్రి తూర్పు నావికాదళం అతిథి గృహంలో బస చేస్తారు. ఆ తర్వాత రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.