
పేదరికం నిర్మూలన లక్ష్యంగా ‘పీ–4’ అమలు
జిల్లా ఇన్‌చార్జి మంత్రి
డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
మహారాణిపేట: రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ, సచివాలయ, గ్రామ వలంటీర్ల శాఖా మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పీ–4, స్వర్ణాంధ్ర విజన్ 2047పై జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం పూర్తిగా తొలగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన 20 శాతం కుటుంబాలను (బంగారు కుటుంబాలు) గుర్తించి, ఆర్థికంగా, విద్యాపరంగా, వ్యక్తిగతంగా స్థిరపడిన వారిచే దత్తత తీసుకునేలా చేస్తామన్నారు. బంగారు కుటుంబాల ఎంపికకు సర్వే జరుగుతోందని, ఆగస్టు 15 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. విశాఖ జిల్లాలో ఇప్పటికే 73,452 బంగారు కుటుంబాలను గుర్తించామని, జూలై 15 నుంచి 28 లోపు సచివాలయ సిబ్బంది ద్వారా పునఃపరిశీలన చేసి తుది జాబితాను రూపొందిస్తామని వివరించారు. దాదాపు 12 వేల మంది సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలను మార్గదర్శులుగా గుర్తించామని, వారితో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. సమావేశంలో ఎంపీ ఎం. శ్రీభరత్, ప్రభుత్వ విప్‌లు వి.చిరంజీవి రావు, పీవీజీఆర్‌ఆర్ నాయుడు, మేయర్ పీలా శ్రీనివాస రావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, వంశీ కృష్ణ శ్రీనివాస యాదవ్, పి. విష్ణు కుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ బాబు, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.