
నగరంలో మరో సబ్ వే
● రూ.12.5 కోట్లతో కాకానినగర్ హైవేపై నిర్మాణం ● టెండర్ల ప్రక్రియను చేపట్టిన వీఎంఆర్‌డీఏ ● ఎన్‌ఏడీ నుంచి ఎయిర్‌పోర్టు మధ్య ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకే..
విశాఖ సిటీ: నగరంలో మరో సబ్ వే త్వరలో అందుబాటులోకి రానుంది. ఎన్‌ఏడీ కొత్త రోడ్డు నుంచి ఎయిర్‌పోర్టు మధ్య ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు వీఎంఆర్‌డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ.12.5 కోట్లతో కాకానినగర్ హైవే జంక్షన్‌లో అండర్ పాస్ నిర్మాణానికి వీఎంఆర్‌డీఏ బోర్డు కూడా ఆమోద ముద్ర వేసింది. దీంతో ఈ పనులను వేగవంతంగా చేపట్టేందుకు అధికారులు టెండర్ల ప్రక్రియను చేపట్టారు. దీని ద్వారా ఎన్‌డీఏ–ఎయిర్‌పోర్టు మధ్య రాకపోకలు సులభతరం కానున్నాయి. ఎన్‌డీఏ కొత్త రోడ్డు జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు వీఎంఆర్‌డీఏ ఇప్పటికే రోటరీ విధానంలో ఫ్లై ఓవర్‌ను నిర్మించింది. ఫ్లై ఓవర్‌పై భారీ వాహనాలు, కింద రోడ్డులో 3/2 చక్ర వాహనాలు, పాదచారులకు వెళ్లేలా డిజైన్ చేశారు. దీంతో నాలుగు రోడ్ల జంక్షన్ మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగాయి.
84 మీటర్ల దూరంగా ట్రాఫిక్ రద్దీ
ఎన్‌ఏడీ కొత్త రోడ్డులో ట్రాఫిక్ సమస్య తొలగినప్పటికీ.. అక్కడకు కేవలం 84 మీటర్ల దూరంలో ట్రాఫిక్ రద్దీ ఇబ్బందికరంగా మారింది. రైల్ ఓవర్ బిడ్జ్ ల్యాండ్ అయిన వెంటనే కాకానినగర్ జంక్షన్‌లో ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఎన్‌ఏడీ వద్ద తొలగిన సమస్య 100 మీటర్లు దాటకముందే ఉత్పన్నమవుతోంది. అనేక సందర్భాల్లో కాకానినగర్ నుంచి ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్ వరకు ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య, సాయంత్రం 4 నుంచి రాత్రి వరకు ఈ రహదారిలో ప్రయాణం కష్టంగా మారుతోంది. దీంతో కాకానినగర్ జంక్షన్‌లో సబ్ వే నిర్మించాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.
రూ.12.5 కోట్లతో సబ్ వే నిర్మాణం
ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్(ఏపీయూఐఏఎంఎల్) వీఎంఆర్‌డీఏతో కలిసి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. ఈ సబ్ వే నిర్మాణానికి రూ.12.5 కోట్లతో అంచనాలు రూపొందించింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. దీని ప్రకారం ఆర్‌వోబీ–కాకానినగర్ మధ్య 18 మీటర్ల వెడల్పుతో సబ్ వే నిర్మించనున్నారు. ఇందులో సర్వీస్ రోడ్డుతో పాటు పాదచారులకు వీలుగా ఫుట్‌పాత్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే కాకానినగర్ జంక్షన్‌లో వాహనాలు నిలపాల్సిన అవసరం ఉండదు. ఎన్‌ఏడీ నుంచి ఎయిర్‌పోర్టు మధ్య రాకపోకలు సులభతరమవుతాయి. ఈ సబ్ వే నిర్మాణానికి వీఎంఆర్‌డీఏ టెండర్లను ఆహ్వానించింది. 2026, డిసెంబర్ నాటికి దీన్ని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు.