
వైఎస్సార్ కీర్తి అజరామరం
ఘనంగా మహానేత జయంతి వేడుకలు
వాడవాడలా సేవా కార్యక్రమాల నిర్వహణ
ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు మంగళవారం జిల్లాలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పేదలకు చీరలు, వృద్ధులకు దుప్పట్లు, నిత్యావసర సరకులు పంపిణీ చేసి తమ ఉదారతను చాటుకున్నారు. వృద్ధాశ్రమాల్లో అన్నదానం చేశారు. ఆసుపత్రుల్లోని రోగులకు పండ్లు, రొట్టెలు పంచి పెట్టి వారిలో మనోధైర్యాన్ని నింపారు. –సాక్షి, విశాఖపట్నం