
ప్రేమించానంటూ వెంటపడి ఉసురు తీశాడు
మృతురాలు కావ్యశ్రీ తల్లిదండ్రులు
విశాఖపట్నం: వివాహం చేసుకుంటానని తమ కుమార్తెను వంచించి వేరే వ్యక్తితో సంబంధం ఉందంటూ యశ్వంత్ అనే యువకుడు చంపేశాడని ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి ప్రాంతానికి చెందిన కార్తీక రామారావు, కార్తీక రామలక్ష్మి కన్నీరు మున్నీరయ్యారు. కార్తీక నవ్యశ్రీ (25)ని ప్రేమికుడు యశ్వంత్ తామెవరం ఇంట్లో లేని సమయంలో ఈ నెల 2వ తేదీన చంపేశాడని తెలిపారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మృతురాలు కార్తీక నవ్యశ్రీ తల్లిదండ్రులు రామారావు, రామలక్ష్మి తెలిపిన వివరాలివి. 35 ఏళ్ల కిందట బతుకు తెరువు కోసం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు నుంచి ఇక్కడికి వచ్చి కూలి పనులు చేసుకుంటున్నామని వారు చెప్పారు. తమ కుమార్తె కార్తీక నవ్యశ్రీ, యశ్వంత్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు. వారి పెళ్లికి రెండు కుటుంబాలు సమ్మతించాయన్నారు. ఈ నేపథ్యంలో కావ్యశ్రీకి హైదరాబద్‌లో ఉద్యోగం దొరకడంతో వెళ్లి ఉద్యోగం చేసుకోమని యశ్వంత్ ఆమెతో చెప్పాడని పేర్కొన్నారు.
అక్కడి నుంచే వేధింపులు ప్రారంభం..
కావ్యశ్రీ హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటుండగా అనుమానం పెంచుకున్న యశ్వంత్ నీవు ఎవరితోనో తిరుగుతున్నావని తరచూ వేధించేవాడని, కావ్యశ్రీని వైజాగ్ వచ్చేయమని చెప్పడంతో ఆమె మూడు నెలల కిందట వచ్చి వర్క్ ఫ్రం హోం చేస్తుందని తెలిపారు.
మేము లేనప్పుడు..
గత నెల 29న ఇంటి పని కోసం కొత్తూరు వెళ్లామని, కావ్యశ్రీ నుంచి ఫోన్ వచ్చిందని, యశ్వంత్ తనను వేధిస్తున్నాడని చెప్పిందన్నారు. మూడు రోజుల పాటు యశ్వంత్ కావ్యశ్రీతోనే ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (2వ తేదీ వేకువ జాము) యశ్వంత్ నుంచి తమకు ఫోన్ వచ్చిందని, కావ్యశ్రీ ఉరి పోసుకున్నట్టు తెలిపాడన్నారు. ఉదయం వచ్చి చూసే సరికి తమ కుమార్తె చనిపోయి ఉందన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఇంట్లో ఉన్న హుక్ కూడా ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకునేంతగా ఉండదని, యశ్వంతే తమ కుమార్తెను చంపేసి ఉండాడని అనుమానం వ్యక్తం చేశారు. స్థానికులు, కావ్యశ్రీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి యశ్వంత్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను రిమాండ్‌లో ఉన్నాడు.