
ఫిరాయింపు కార్పొరేటర్లపై చర్యలు తీసుకోండి
జీవీఎంసీ కమిషనర్‌ను కోరిన వైఎస్సార్ సీపీ
డాబాగార్డెన్స్: పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లపై చర్యలు తీసుకున్న తర్వాతే జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నిక నిర్వహించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తైనాల విజయ్‌కుమార్, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం వారు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. స్థాయీ సంఘం ఎన్నిక నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఎన్నిక నిర్వహించాలంటే.. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం అర్హత గల వార్డు సభ్యులు నామినేషన్ అందజేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఏప్రిల్‌లో నిర్వహించిన మేయర్ అవిశ్వాస తీర్మానం(ఎన్నిక)లో వైఎస్సార్ సీపీ జెండాపై గెలిచిన 27 మంది కార్పొరేటర్లు.. పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటు వేశారని గుర్తుచేశారు. ఈ కారణంగా వారిని వార్డు సభ్యులుగా అనర్హులుగా ప్రకటించాలని ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్‌ను పార్టీ విప్ కోరారని తెలిపారు. అప్పటి ప్రిసైడింగ్ అధికారి, పార్టీ విప్ అందజేసిన దరఖాస్తు సహేతుకమైనదని భావించి.. పార్టీ విప్‌ను ధిక్కరించిన కార్పొ రేటర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు ఈ నెల 14న నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు. సంబంధిత కార్పొరేటర్లు ఇచ్చిన వివరణపై తుది నిర్ణయం తీసుకోవాలని ప్రిసైడింగ్ అధికారికి హైకో ర్టు ఆదేశించిందని, పార్టీ విప్‌ను ధిక్కరించిన వారందరూ కార్పొరేటర్లుగా చట్టప్రకారం అనర్హులని వారు పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సంబంధిత అభ్యర్థులకు ఇచ్చిన నోటీసుపై తుది నిర్ణయం తీసు కునే వరకు, జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నిక నోటిఫికేషన్‌ను నిలుపుదల చేయాలని కమిషనర్‌ను కోరారు.