
పీ–4పై కలెక్టర్ సమీక్ష
మహారాణిపేట : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ–4 విధానానికి అధికారులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పీ–4 సర్వేపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. జిల్లాలో ఇప్పటికే గుర్తించిన బంగారు కుటుంబాల అవసరాలను తెలుసుకోవాలని, వారిని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చే 10 వేల మంది మార్గదర్శులను వారం రోజుల్లో గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి సచివాలయం పరిధిలో రోజుకు 50 బంగారు కుటుంబాల అవసరాలను గుర్తించి, జిల్లా మొత్తంలో రోజుకు 1,300 మందికి సంబంధించిన వివరాలపై సర్వే పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. పారిశ్రామిక, సేవా, ఇతర రంగాల్లో ఆర్థికంగా సమర్థత కలిగిన వారిని మార్గదర్శులుగా గుర్తించాలని సూచించారు. ఒక్కో మార్గదర్శి కనీసం పది కుటుంబాలను దత్తత తీసుకునేలా ప్రోత్సహించాలని, సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న 20 శాతం మంది పేదలకు అండగా నిలవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఏపీఐఐసీ, పారిశ్రామిక సంస్థలు, పర్యాటక ప్రాజెక్టుల నిర్వాహకులు, వివిధ వ్యాపార కంపెనీలు, అసోసియేషన్లు పీ–4లో ఉత్సాహంగా భాగస్వామ్యం కావాలని, దీనికి సంబంధిత అధికారులు బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. అధికారులు కూడా కనీసం ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని హితవు పలికారు. తగిన ప్రోఫార్మా రూపొందించి అధికారులందరికీ సర్క్యులేట్ చేయాలని సీపీఓను ఆదేశించారు.