
హైడ్రోపవర్ ప్రాజెక్ట్‌లు వద్దేవద్దు
● ఏజెన్సీలో గిరిజనులకు చాలా నష్టం ● విశాఖకు తాగునీటి కష్టాలు ● జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్లకార్డులతో నిరసన ● సభ్యుల సూచన మేరకు ప్రాజెక్ట్‌ల రద్దుకు తీర్మానం
మహారాణిపేట: అనంతగిరి మండలం గుజ్జిలి, చిట్టంవలసలో ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రో పవర్ ప్రాజెక్టు సర్వేను తక్షణమే నిలిపివేయాలని, ప్రాజెక్టు అనుమతులను రద్దు చేయాలని బుధవారం జరిగిన జెడ్సీ సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతగిరి జెడ్పీటీసీ(సీపీఎం) సభ్యుడు డి.గంగరాజు ఈ అంశాన్ని తొలుత లేవనెత్తుతూ, ఏజెన్సీలో హైడ్రో ప్రాజెక్టు అమలు చట్ట విరుద్ధమని, ఇది గిరిజన చట్టాలను, 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తుందన్నారు. అదానీ, నవయుగ కంపెనీలు ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నాయని, గ్రామసభల నిర్వహణపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల రైవాడ జలాశయం నీరు కలుషితమై విశాఖ నగర తాగునీటి సరఫరాకు, రైతులకు ఇబ్బందులు వస్తాయని గంగరాజు హెచ్చరించారు. దీనిపై జెడ్పీ చైర్‌పర్సన్ జె. సుభద్ర మాట్లాడుతూ ఇలాంటి ప్రాజెక్టుల వల్ల ఏజెన్సీకి ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కూడా డిమాండ్ చేశారు. దీనిపై అల్లూరి సీతారామరాజు కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ స్పందిస్తూ.. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని, గ్రామసభలు నిర్వహించి, తీర్మానాలు చేసిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. అరకు ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు ఈర్లె అనురాధ, చెట్టి రోషిణి, కె.నూకరాజు, సన్యాసిరాజు, ఎంపీపీ బి.రమేష్ బాబు, సీపీఎం సభ్యుడు గంగరాజు తదితరులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.
కేజీహెచ్‌లో మెరుగైన సేవలందించాలి
ఉచిత విత్తనాలు అందించాలని, రైతు భరోసాకు సంబంధించి రైతుల సంఖ్య గతంలో కన్నా ఇప్పుడు తగ్గడానికి కారణాలు తెలియజేయాలని పలువురు సభ్యులు కోరారు. గిరిజనులకు కేజీహెచ్‌లో సరైన వైద్యం అందడం లేదని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షలు వసూలు చేస్తున్నారని గంగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి వివరాలు అందజేస్తే విచారణ చేస్తామని కలెక్టర్ హరేందిర ప్రసాద్ చెప్పారు. గత ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ సర్వే కొనసాగుతుందా? ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలపాలని సభ్యులు కోరగా.. విశాఖ కలెక్టర్ మాట్లాడారు. 250 ఎకరాలు ఒక బ్లాక్‌గా తీసుకొని రీసర్వే జరుగుతుందన్నారు. కేజీహెచ్‌లో ఎస్టీ సెల్ సేవలు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, గిరిజన ప్రాంతాల నుంచి కేజీహెచ్‌కు వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందించాలని జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర సూచించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి మాట్లాడుతూ అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. అంబులెన్సులు తక్కువగా ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. దీనిపై అల్లూరి కలెక్టర్ దినేష్‌కుమార్ స్పందిస్తూ సీఎస్సార్ నిధులు వెచ్చించి అంబులెన్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.

హైడ్రోపవర్ ప్రాజెక్ట్‌లు వద్దేవద్దు