
7,500 రేబిస్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ
ఆరిలోవ: ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని పశు వైద్యశాలల్లో ఆదివారం ఉచిత రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు పశుసంవర్థక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. కరుణాకరరావు తెలిపారు. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా సుమారు 7,500 కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాక్సిన్ డోసులు వేసినట్లు వెల్లడించారు. చినగదిలి పశు వైద్యశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమం కోసం జిల్లా మొత్తానికి 20 వేలు డోసులను సిద్ధం చేశామన్నారు. ఆదివారం అందుబాటులో లేని పెంపకందారులు సోమవారం నుంచి తమ కుక్కలను పశు వైద్యశాలలకు తీసుకెళ్లి టీకాలు వేయించుకోవాలని జేడీ సూచించారు. పెంపుడు కుక్కల యజమానులు జూనోసిస్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మొదటి రోజు జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో గోపాలపట్నం పశు వైద్యశాలలో అత్యధికంగా 800కు పైగా కుక్కలకు రేబిస్ టీకాలు వేసినట్లు జేడీ కరుణాకరరావు వెల్లడించారు.