
13 మంది క్రికెట్ బెట్టింగ్‌రాయుళ్ల అరెస్ట్
అల్లిపురం: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 13 మందిని నగర సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 57 మొబైల్ ఫోన్లు, 137 బ్యాంకు బుక్స్, 11 ల్యాప్ టాప్‌లు, 132 ఏటీఎం కార్డులు, 4 సీసీ కెమెరాలు, 2 రూటర్‌లు, ఒక క్యాష్ కౌంటింగ్ మెషీన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనరేట్‌లో గురువారం సీపీ శంఖబ్రత బాగ్చి వివరాలు వెల్లడించారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా అమాయకులను తప్పుదోవ పట్టిస్తూ, క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారికి మ్యూల్ బ్యాంకు అకౌంట్స్ సరఫరా చేస్తున్న కశింకోటకు చెందిన ఓ వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు ఇదివరకే అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి రాబట్టిన సమాచారం మేరకు ఆధునిక సాంకేతిక సహాయంతో బెంగళూరు స్థావరంగా ఉన్న డెన్‌ను గుర్తించారు. దానిపై దాడి చేసి అక్కడున్న 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఒకరు, చత్తీస్‌గఢ్‌కు చెందిన 8 మంది, జార్ఖండ్, బిహార్‌లకు చెందిన చెరో ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. వీరంతా ఆన్‌లైన్ ద్వారా పరిచయమై, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్లతో ఆన్‌లైన్‌లో పరిచయాలు పెంచుకున్నారు. తద్వారా మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను కొరి యర్ ద్వారా సేకరించి వాటిని ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు సీపీ తెలిపారు. అమాయకులైన వారిని బెట్టింగ్ ఊబిలోకి లాగి, అప్పులపాలు చేస్తూ వారి నుంచి డబ్బులు దండుకుంటున్నారని పేర్కొన్నారు. వీరితో రెడ్డన్న 462, బేటాబాయి 52 వెబ్‌సైట్‌లు నడుపుతున్నారన్నారు. ప్రతి టీంలో షిఫ్ట్‌కు ఇద్దరు చొప్పున 24 గంటలూ పనిచేస్తూ అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారని వెల్లడించారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం http:// www.cybercrime. gov. in లేదా 1930 లేదా 7995095799కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.