కాలుష్యంలో కలిసిన లక్ష్యం
● కాలుష్య నియంత్రణకు కూటమి మేయర్ మంగళం ● సెల్లార్‌లో ఉద్యోగులు..సిబ్బంది ద్విచక్ర వాహనాలు ● గత మేయర్ ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణకు చర్యలు
డాబాగార్డెన్స్: కాలుష్య రహిత నగరంగా విశాఖను మార్చాలనే సంకల్పంతో మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి చేపట్టిన కార్యక్రమానికి ప్రస్తుత కూటమి మేయర్ పీలా శ్రీనివాసరావు మంగళం పాడారు. గతంలో ప్రతి సోమవారం వ్యక్తిగత వాహనాలను వదిలి, ప్రజా రవాణాను ఉపయోగించడం ద్వారా కాలుష్య నియంత్రణకు ఆమె ప్రయత్నించారు. దీనికి జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులు కొంతమేర సహకరించేవారు. అయితే అవిశ్వాస తీర్మానం ద్వారా గత మేయర్‌ను గద్దె దించిన కూటమి కార్పొరేటర్లు, కాలుష్య నియంత్రణపై ఆమె తీసుకున్న నిర్ణయాలను విస్మరించారు. కూటమి మేయర్‌గా ఎన్నికై న పీలా శ్రీనివాసరావు ప్రతి సోమవారం వ్యక్తిగత వాహనంలోనే జీవీఎంసీకి వస్తున్నారు. కేవలం మేయర్ మాత్రమే కాకుండా, జీవీఎంసీ ఉద్యోగులు, సిబ్బంది కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. గతంలో జీవీఎంసీ ప్రధాన ద్వారం వరకు మాత్రమే వాహనాల్లో వచ్చిన అధికారులు, ఇప్పుడు నేరుగా కార్యాలయం లోపలికి వాహనాలను తీసుకువస్తున్నారు. గత మేయర్ హరి వెంకట కుమారి కాలుష్య నియంత్రణకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వారంలో ఒక్క రోజు ప్రజా రవాణాను లేదా సైకిళ్లను ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆమె నగర ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలకు వివరించారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కాలుష్య నియంత్రణకు చేపట్టిన ప్రయత్నాలకు అడ్డుకట్ట పడినట్లు కనిపిస్తోంది.
కాలుష్య నియంత్రణకు కృషి చేశా
నగరంలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్య నియంత్రణకు..నగర మేయర్(నాలుగేళ్ల పాటు)గా..నగర పౌరురాలిగా తన వంతు కృషి చేశా. ప్రజల్లో అవగాహన పెంచాం. కాలుష్య నియంత్రణకు ప్రజల్ని భాగస్వాముల్ని చేశాం. ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. కాలుష్య నియంత్రణ గాడిన పడతున్న సమయంలో కూటమి మేయర్ మంగళం పాడడం బాధాకరం. అధికారులు,ఉద్యోగులు,సిబ్బంది కూడా కాలుష్య నియంత్రణ గాలికొదిలేయడం బాధాకరం.
–గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మేయర్,
కాలుష్యంలో కలిసిన లక్ష్యం


