
సింహగిరికి చేరుకున్న లక్ష్మీకాంత్ నాయక్‌దాస్
మూడు నెలలపాటు అప్పన్నకు సేవలు
సింహాచలం: ఒడిశాకు చెందిన లక్ష్మీకాంత్ నాయక్‌దాస్ బుధవారం తన పరివారంతో సింహగిరికి తరలివచ్చారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులకు తులసి ప్రసాదాన్ని అందించారు. తదుపరి సింహగిరిపై ఉన్న దాసుడి సత్రానికి బసచేసేందుకు తరలివెళ్లారు. మూడు నెలలపాటు సింహగిరిపై ఉండి స్వామికి సేవలందించనున్నారు. ఒడిశాలోని పట్టుపురానికి చెందిన దాసుల కుటుంబం తరతరాలుగా సింహాచలేశుడి సేవలో తరిస్తోంది. ఏటా సుమారు మూడు నెలలపాటు సింహగిరిపైనే ఉంటూ స్వామిని సేవించడం పరిపాటి. ఈ మూడు నెలల్లో వీరి ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు సింహగిరికి తరలివచ్చి అప్పన్న స్వామిని దర్శించుకుంటారు. దాసుడి ఆధ్వర్యంలో స్వామికి ఆర్జిత సేవలు విశేషంగా జరిపిస్తారు. ఈ సేవల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో ఒడిశా భక్తు లు ఆయా రోజుల్లో సింహగిరికి తరలివస్తారు. తన తండ్రి వనమాలిక్ నాయక్‌దాస్ మరణానంతరం 2008 నుంచి లక్ష్మీకాంత్ శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని సేవించే బాధ్యతలు స్వీకరించారు.