
రైతుల ఆకలి కేకలు వినిపించడం లేదా?
● చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు పేమెంట్లు లేవు ● ఉపాధి కూలీలకు 75 రోజులుగావేతనాలు చెల్లించడం లేదు ● శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ధ్వజం
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులన్నా.. పేదలన్నా చులకన భావమని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పది నెలల పాలనలో రైతుల ఆకలి కేకలు వినిపించడంలేదా? అని చంద్రబాబును ప్రశ్నించారు. చోడవరం షుగర్స్ రైతుల సమస్యలు, ఉపాధి కూలీల వేతనాల సమస్యలను గాలికొదిలేసి.. వైఎస్సార్ సీపీ నేతలపై దూషణలకు, వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే పనిగా పాలన సాగిస్తున్నారంటూ మండిపడ్డారు. లాసన్స్‌బేకాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పది నెలల పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో లక్ష టన్నులకు పైగా క్రషింగ్ నిలిచిపోయిందని, రైతులకు నేటికీ డబ్బు చెల్లించలేదన్నారు. రైతులకు డబ్బులు ఇవ్వకపోగా.. క్రషింగ్‌ను కూడా నిలిపివేస్తుంటే కూటమి ప్రభుత్వం నిద్రపోతుందా అంటూ మండిపడ్డారు. తక్షణమే కార్మికులకు, ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 75 రోజులుగా ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించకుండా ఈ ప్రభుత్వం బకాయి పెట్టిందని మండిపడ్డారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా 75 రోజుల ఉపాధి వేతనాలను ఆపిన సందర్భాలు లేవన్నారు. కష్టపడ్డ వారికి కూలి డబ్బులు ఇవ్వకుండా నిలిపివేస్తే.. రాష్ట్రంలో పేదలు ఎలా బతకాలని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కూలీలకు రూ.700 కోట్లు ఇవ్వాల్సి ఉందని, వేతనాలు ఇవ్వాలని ఉపాధి కూలీలు కూడా నిరసనలు తెలియజేస్తున్నారన్నారు. తక్షణమే వారి వేతనాల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చేస్తే సరిపోదని, ఏ హామీలైతే ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలని బొత్స డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్‌నాథ్ పాల్గొన్నారు.