నారా లోకేష్‌ ఎదురుగానే బాలకృష్ణ చిన్నల్లుడి వ్యాఖ్యలు

- - Sakshi

గంటాకు తీవ్ర అవమానం

లోకేష్‌ సభలో బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌ వ్యాఖ్యలు

మనస్థాపం చెందిన గంటా

ఎన్నికల సంచార జీవి అంటూ టీడీపీలోనే విపరీతమైన చర్చ

సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల సంచార జీవి.. కనీసం ఏనాడైనా ప్రజలకు ముఖం చూపించాడా?.. ఈ కామెంట్లు బయట జనాలు కాదు.. సొంత పార్టీ టీడీపీలోనే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా.. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌, గంటాను తీవ్రంగా అవమానించాడనే చర్చ నడుస్తోంది. అదీ నారా లోకేష్‌ సమక్షంలోనే కావడం గమనార్హం!. 

విశాఖ పర్యటనలో భాగంగా శంఖారావం సభ సాక్షిగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు తీవ్ర అవమానం ఎదురైంది. టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని బిర్లా జంక్షన్‌ వద్ద సోమవారం నిర్వహించిన శంఖారావం సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సభలో టీడీపీ విశాఖ పార్లమెంట్‌ ఇన్‌చార్జి, లోకేష్‌ తోడల్లుడు భరత్‌ .. గంటాపై ప్రత్యక్షంగానే విమర్శలు గుప్పించారు.

ఇక్కడ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీకు అందుబాటులో లేకపోయినా మేం అండగా ఉంటామని చెప్పారు. ప్రజల సమస్యలను తీర్చుతామంటూ వేదికపైనే గంటా సమక్షంలోనే వ్యాఖ్యలు చేశారు. దీంతో గంటా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వేదికపై ఉన్న నేతలతో పాటు కార్యకర్తలు సైతం భరత్‌ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ, ఉత్తర నియోజకవర్గ పార్టీ నేతలు కార్యకర్తలు మాత్రం భరత్‌ వ్యాఖ్యలు సమంజసమైనవేనని చర్చించుకోవడం కొసమెరుపు.

ఇప్పటికే క్యాడర్‌లో గంటాపై పూర్తిగా విశ్వాసం పోయింది. మరోవైపు ఉత్తర నియోజకవర్గ ఇన్‌చార్జిగా తమకు బాధ్యతలు అప్పగించాలంటూ ఆదివారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత స్వయంగా గంటాకే వినతిపత్రం అందించారు. ఈ వ్యవహారం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పరిణామాలన్నీ చూస్తుంటే..  గంటాపై ఉత్తర నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం గుర్రుగా ఉన్నట్లు అర్థమవుతోంది.

whatsapp channel

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top