Drunkness And Over Speeding Of The Youth Caused Three Deaths On Visakha Bheemili Route - Sakshi
Sakshi News home page

Vizag Beach Road Incident: మద్యం మత్తులో యువకులు.. వైజాగ్‌ బీచ్‌రోడ్డులో కారు బీభత్సం..

Aug 8 2023 7:40 AM | Updated on Aug 8 2023 12:39 PM

- - Sakshi

విశాఖపట్నం: మద్యం మత్తు... ఆపై అతివేగం... వెరసి మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనతో ఎటువంటి సంబంధమూ లేని దంపతులు ప్రమాద స్థలిలోనే దుర్మరణం చెందడం చూపరులను కలిచివేసింది. బీచ్‌రోడ్డులోని రాడిసన్‌ బ్లూ హోటల్‌ సమీపంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన దుర్ఘటనకు సంబంధించి ద్వారకా జోన్‌ ఏసీపీ ఆర్‌వీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

నగరానికి చెందిన ఐదుగురు యువకులు కారులో మద్యం సేవిస్తూ సాగరనగర్‌ నుంచి రుషికొండ వైపు వేగంగా వస్తున్నారు. కారు రాడిసన్‌ బ్లూ హోటల్‌ సమీపానికి వచ్చే సరికి వేగాన్ని నియంత్రించ లేకపోవడంతో అదుపుతప్పింది. డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డులోకి దూసుకెళ్లిన కారు... అదే సమయంలో రుషికొండ నుంచి నగరంలోకి వెళ్తున్న దంపతుల బైక్‌ను... తర్వాత చెట్టును ఢీకొట్టింది.

ఈ హఠాత్పరిణామంతో దంపతులు తీవ్ర గాయాలతో ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచారు. కారులో వెనుక సీటులో కూర్చున్న ఓ యువకుడు కూడా మృతి చెందాడు. ఎయిర్‌ బెలూన్స్‌ ఓపెన్‌ కావడంతో కారు నడుపుతున్న యువకుడితోపాటు ముందు కూర్చన్న మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డారు. కారులో ఉన్న మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో అతని స్నేహితులు కేజీహెచ్‌కు తరలించారు.

అతి వేగం యమపాశమై...
ఏపీ 39 జేవో 9466 నంబరు కారులో బీరు బాటిళ్లు ఉండడంతో అందులోని యువకులు మద్యం సేవించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మద్యం మత్తులో అతివేగంగా, నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కారులో మరణించిన యువకుడిని పీఎం పాలెంకు చెందిన మజ్జి మణికుమార్‌గా పోలీసులు గుర్తించారు.

ఈ ప్రమాదంలో చనిపోయిన భార్యభర్తలు రాయగడ ప్రాంతానికి చెందిన సింగారపు పృధ్వీరాజ్‌ (28), ప్రియాంక్‌ (21)గా గుర్తించారు. వీరు రుషికొండ నుంచి నగరంలోకి వస్తూ ఈ ప్రమాదంలో మృతిచెందారు. కారులో ప్రయాణించిన వారిలో వినయ్‌ అనే యువకుడు పరారీలో ఉండగా మిగతా వారు వివరాలు చెప్పే స్థితిలో లేరని పోలీసులు వెల్లడించారు.

ప్రమాద సమయంలో కారు వేగం 150 కిలోమీటర్లపైనే వుండొచ్చని అభిప్రాయపడ్డారు. కారు వేగానికి చెట్టు వేళ్లతో సైతం లేచిపోయి పక్కరోడ్డులో పడడంతో ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. మృతదేహాలను అర్ధరాత్రి దాటాక కేజీహెచ్‌కు పోలీసులు తలించారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాపు చేస్తున్నామని, మంగళవారం వివరాలు తెలియజేస్తామని ఏసీపీ మూర్తి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement