కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర
తాండూరు రూరల్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని కరన్‌కోట్ సీసీఐ టౌన్ షిప్‌లో అరైవ్ అలైన్ కార్యక్రమం నిర్విహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు జరగవన్నారు. మత్తు పదార్థాలు, మద్యం సేవించి వాహనాలు నడపడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. పోలీసులు తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. అంతకుముందు సీసీఐ టౌన్ షిప్ వద్ద కంటి వైద్య శిబిరం నిర్వహించారు. అవసరం ఉన్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు నాయక్, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజాబాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ రజాక్, సర్పంచ్ రాజ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, సీసీఐ అధికారులు పాల్గొన్నారు.
సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులో ఉండాలి
యాలాల: పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వసతి గృహాల్లో సబ్జెక్టు టీచర్లు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం మండలంలోని కోకట్ శివారులో గల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. మెనూ చార్ట్‌ను పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్రంపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ సందేహాలను టీచర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తాండూరు ఆర్డీఓ అనిత, తాండూరు తహసీల్దార్ తారాసింగ్, ప్రిన్సిపాల్ సరస్వతీ తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో పరిష్కరించాలి
అనంతగిరి: ప్రజావాణి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 186 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తులను పెండింగ్ పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్‌డీఓ శ్రీనివాస్, ఆర్‌డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.


