సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యడు వెంకటయ్య
పరిగి: పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించడంతోపాటు కృత్రిమ కొరతను నివారించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యడు వెంకటయ్య డిమాండ్ చేశారు. సోమవారం పరిగి పట్టణంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సిలిండర్ ధర పెంచడం ద్వారా దేశ ప్రజలపై రూ.60 వేల కోట్ల భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం పేరుతో ధరలు పెంచడం సరికాదని హితవు పలికారు. విశ్వగురువని చెప్పుకునే ప్రధాని మోదీ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారో చెప్పాలన్నారు. తక్షణం ఇంధన కొరత లేకుండా చూడాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు హబీబ్, సత్తయ్య, అక్బర్, రాఘురాం, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ ముఠా అరెస్ట్
శంకర్‌పల్లి: డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన పొన్నాల సిద్దార్థ్(27) సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్‌లో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్నేళ్లుగా డ్రగ్స్‌కు అలవాటు పడిన సిద్దార్థ్ గోవా నుంచి మాదకద్రవ్యాలను తీసుకొచ్చి పబ్‌లు, క్లబ్‌లతో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు అమ్ముతున్నాడు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన సాఫ్ట్‌వేర్ చలవాడి హిమంత్ కృష్ణవంశీ(30) హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా.. సిద్దార్థ్‌కు పరిచయమయ్యాడు. వీరికి నాచారానికి చెందిన రొయ్యల వ్యాపారి అవదూత విష్ణుతేజ(36) జతయ్యాడు. ముగ్గురూ ముఠాగా ఏర్పడి గోవా నుంచి 39.72 గ్రాముల కొకై న్, 3గ్రాముల గంజాయి తీసుకుని మోకిల పీఎస్ పరిధిలోని ఇంద్రారెడ్డినగర్ మీదుగా వెళ్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఆదివారం వాహన తనిఖీలు చేస్తుండగా, ముగ్గురూ డ్రగ్స్‌తో పట్టుబడ్డారు. వీరి నుంచి మాదకద్రవ్యాలతో పాటు కారు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, సోమవారం చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం రిమాండ్ నిమిత్తం సంగారెడ్డి జైలుకు తరలించారు.


