తాండూరు టౌన్: ఆస్తి పన్ను వసూలుకు మున్సిపల్ అధికారులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నేటితో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో మొండి బకాయిల వసూలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా తాండూరులోని ఓ పెట్రోల్ బంక్ యజమాని ఐదేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సోమవారం చెత్త సేకరణ వాహనాలతో బంక్‌ను ముట్టడించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని విలియంమూన్ చౌరస్తాలో ఇలాహి పెట్రోల్ బంక్ ఉంది. దాని యజమాని ఐదేళ్లుగా పన్ను చెల్లించడం లేదు. రూ.82 వేల వరకు బకాయి ఉంది. పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఫలితం లేకపోవడంతో ఉదయం చెత్త వాహనాలతో మున్సిపల్ అధికారులు పెట్రోల్ బంక్ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో యజమాని లేకపోవడంతో అక్కడి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పన్ను చెల్లించే వరకు పెట్రోల్ బంక్ వద్దకు చెత్త వాహనాలు వస్తుంటాయని తేల్చి చెప్పారు. పన్ను బకాయిల వసూలుకు ఉన్నతాధికారులు టార్గెట్ పెట్టడంతో అధికారులు ఇళ్లు, దుకాణాల వద్దకు పరుగులు పెడుతున్నారు. నేటి(మంగళవారం) సాయంత్రంలోగా కచ్చితంగా పన్ను కట్టాలని ఆదేశిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్టణం అభివృద్ధి చెందాలంటే పన్నులే ముఖ్యమన్నారు. ఏళ్ల తరబడిగా చెల్లించకపోతే అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రజలు పన్నులు చెల్లించి సహకరించాలని ఆయన కోరారు.
ఆస్తి పన్ను వసూలుకు
మున్సిపల్ అధికారుల వినూత్న యత్నం


