ధర్నాల సెగ! | - | Sakshi
Sakshi News home page

ధర్నాల సెగ!

Mar 31 2026 10:38 AM | Updated on Mar 31 2026 10:38 AM

భూములు లాక్కోవద్దంటూ అన్నదాతల కలెక్టరేట్‌ ముట్టడి

ముఖ్యమంత్రి, పరిగి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు

పరిశ్రమలు వద్దంటూ ఆందోళన

డిమాండ్ల సాధన కోసం ఆశవర్కర్ల పోరుబాట

వికారాబాద్‌: జిల్లాలో ఎటు చూసినా అన్నదాతల ఆందోళనలే కనిపిస్తున్నాయి. మా భూములు లాక్కోవద్దంటూ సోమవారం పరిగి మండలం రాపోల్‌ గ్రామస్తులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. వికారాబాద్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో దళారుల జోక్యాన్ని తగ్గించాలంటూ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తమకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలంటూ ఆశ వర్కర్లు బీఆర్‌టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్‌ సరఫరా సక్రమంగా కాక పంటలు దెబ్బతింటున్నాయని పలు చోట్ల అన్నదాతలు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఇలా జిల్లా అంతటా ధర్నాలు.. రాస్తారోకోలు జరిగాయి. మండలాలు, నియోజకవర్గ, జిల్లా కేంద్రంలో కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. సీఎం జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కడం ఆందోళన కలిగిస్తోంది.

చావనైనా చస్తాం కానీ..

పరిగి మండలం రాపోల్‌, కళ్లాపూర్‌ గ్రామాల రెవెన్యూ పరిధిలో 1,170 ఎకరాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వ, పట్టా భూముల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. దీన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. సోమవారం పెద్ద సంఖ్యలో రాపోల్‌ రైతులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు స్పందించకపోవడంతో లోపలికి చొచ్చుకెళ్లి ఆందోళనకు దిగారు. తమ ప్రాణాలు పోయినా భూములు మాత్రం ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. సీఎం డౌన్‌డౌన్‌, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. వికారాబాద్‌ సీఐ రఘు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. కలెక్టర్‌ బయటకు రావాలంటూ నినదించారు. ఆర్డీఓ వాసుచంద్ర వచ్చి రైతుల నుంచి వినతిపత్రం తీసుకోవడంతో ధర్నా విరమించి వెళ్లిపోయారు.

కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో..

వికారాబాద్‌ మార్కెట్‌ యార్డు వద్ద కిసాన్‌ సంఘ్‌ నాయకులు ఆందోళనకు దిగారు. దళారులు రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారులను కట్టడి చేయటంతో పాటు రైతు సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఆశవర్కర్ల నిరసనలు

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కొన్ని రోజులుగా ఆశవర్కర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం కలెక్టరేట్‌కు చేరుకొని ధర్నా చేశారు. అధికారులు రాకపోవడంతో ర్యాలీగా కలెక్టరేట్‌ లోపలికి వెళ్లి ఎండలో బైఠాయించి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏసీలో మీరు.. ఎండలో మేమా..? అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీ వేతనం ఇవ్వాలని ఈ మొత్తాన్ని రూ.18వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఆశలు హెచ్చరించారు. వీరి తరఫున బీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం రాష్ట్ర నాయకుడు కృష్ణ ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

రాస్తారోకోలు, నిరసనలతో దద్దరిల్లిన సీఎం జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement