ఇబ్రహీంపట్నం రూరల్: ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సెర్ప్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లీలాకుమారి అన్నారు. సెర్ప్ జిల్లా ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వయోజన విద్యను ప్రోత్సహించడానికి ఉల్లాస్ అమ్మకు అక్షరమాల పేరుతో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సంరద్భంగా అన్ని పంచాయతీల పరిధిలో మహిళలకు అక్షరాభ్యాసం చేయించి అక్షరాలు నేర్పించారు. అనంతరం సర్టిఫికెట్లు అందజేశారు. మండలంలోని నాగన్‌పల్లిలో కార్యక్రమాన్ని సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ లీలాకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్షరాస్యత పెంపొందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో అందరికీ చదువు తప్పనిసరి అని పేర్కొన్నారు. వేలి ముద్రలు వేయకుండా సంతకాలు చేయాలని సూచించారు. చదువే జ్ఞానం చదువే వెలుగని, గ్రామాల్లో ఎక్కడ చూసినా చదువుకున్న వారే కనిపించాలన్నారు. కనీసం అక్షర అవగాహన ఉంటే మంచిదన్నారు. కార్యక్రమంలో ఏపీఎం సాంబశివుడు, సీసీలు సత్తయ్య, మల్లేష్, అశోక్, ఆనంద్, జంగమ్మ, హరిలాల్, వీఓఏలు, గ్రామ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


