ధారూరు: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా మూడు నెలలుగా రోడ్డు నిర్మాణ పనులు సాగడం లేదని మండల పరిధిలోని కేరెళ్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఆదివారం తాండూరు–వికారాబాద్ ప్రధాన రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామానికి రెండు వైపులా సీసీ రోడ్డు నిర్మాణం కోసం ఉన్న బీటీ రోడ్డును గతంలో తవ్వేశారు. మూడు నెలలవుతున్నా అసంపూర్తిగా వదిలేశారు. దీంతో వాహనాల దుమ్ము ఇళ్లలోకి చేరుతుందన్నారు. వృద్ధులు, చిన్నారులకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని ఆరోపించారు. త్వరితగతిన రోడ్డు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రోడ్డుపైకి గ్రామస్తులు చేరుకొని వాహనాలను ఆపేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని నచ్చజెప్పారు. అనంతరం ట్రాఫిక్ జాంను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.


