బొంరాస్‌పేట: మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి శివారులో గుట్టపై స్వయంభుగా వెలసిన పార్వతీ సమేత పరమేశ్వర ఆలయంలో ఆదివారం శివపార్వతుల కల్యాణం కనులపండువగా సాగింది. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఊరేగింపుతో శివపార్వతుల విగ్రహాలను గుట్టకు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం అభిషేకం, రుద్రహోమం, మధ్యాహ్నం పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం పల్లకీసేవ, పెరుగుబసంతం, రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం సుప్రభాతం, వీడ్కోలు సభలుంటాయని నిర్వాహకులు, పూజారి శాంతకుమా ర్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు కేశవులు, వెంకటేశ్, దేవ్‌సింగ్, భీంరెడ్డి, రాయన్న, అంజిలయ్య తదితరులు పాల్గొన్నారు.


