రోడ్డు లేక.. వెతలు తీరక | - | Sakshi
Sakshi News home page

రోడ్డు లేక.. వెతలు తీరక

Mar 27 2026 10:13 AM | Updated on Mar 27 2026 10:13 AM

ఎక్కచెరువు తండాకు నిలిచిన రోడ్డు నిర్మాణ పనులు

దుద్యాల్‌: రోడ్డు మంజూరై దాదాపు రెండేళ్లు కావొస్తోంది. కొంత దూరం నిర్మాణం పూర్తిచేసి, మిలిగిన అధికభాగం అలాగే వదిలేయడంతో మండల పరిధిలోని ఎక్కచెరువు తండావాసులు అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన ప్రారంభంలో హస్నాబాద్‌ గ్రామం నుంచి కొడంగల్‌ మండల పరిధిలోని గ్రామాలపై పల్గురాళ్ల తండా, ఎక్కచెరువుతండా, దుద్యాల్‌ మండల ఎక్కచెరువు తండా మీదుగా చిలుముల్‌ మైల్వార్‌ వరకు దాదాపు పది కిలోమీటర్ల వరకు బీటీ రోడ్డు మంజూరైంది. ఇందుకుగాను రూ.4.65 కోట్లు ఒకసారి, రూ.75 లక్షలు రెండోసారి నిధులు కేటాయించారు. హస్నాబాద్‌ నుంచి పల్గురాళ్ల తండా వరకు, పల్గురాళ్ల తండా నుంచి జీడిగడ్డ తండా వరకు బీటీ రోడ్డు ఇదివరకే పూర్తి చేశారు. అలాగే పల్గురాళ్ల తండా నుంచి ఎక్కచెరువుతండా మీదుగా చిలుముల్‌ మైల్వార్‌ గ్రామం వరకు రోడ్డు వేయకుండా నిలిపివేశారు. రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చాలని చిలుముల్‌ మైల్వార్‌ గ్రామానికి చెందిన కొందరు బడా నాయకులు పట్టుబట్టారని, అందుకే పనులు నిలిపివేశారని వివిధ తండాలకు చెందిన గిరిజనులు వాపోతున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

పెత్తందారుల ఒత్తిడి

రోడ్డు సమస్యపై పలుమార్లు అధికారులను సంప్రదించగా పట్టించుకోలేదని తండావాసులు వాపోయారు. దీంతో అందరూ కలిసి గతంలో చిలుముల్‌ మైల్వార్‌లో ధర్నా సైతం నిర్వహించారు. కానీ ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెత్తందారులకు అధికారులు వత్తాసు పలకడంతో రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలాసార్లు కడా ప్రత్యేక అధికారిని కలిసినా సమస్య పరిష్కరించలేదని తండావాసులు పేర్కొన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తండాకు రోడ్డు వేయాలని కోరుతున్నారు.

రవాణా సౌకర్యం లేకపోవడంతో

గిరిపుత్రులకు ఇబ్బంది

ధర్నా చేసినా పట్టించుకోని అధికారులు

బడికి వెళ్లాలంటే ఇబ్బంది

ఎక్కచెరువు తండా నుంచి చిలుముల్‌ మైల్వార్‌కు చదువుకోవడానికి నిత్యం చాలా మంది విద్యార్థులం నడిచి వెళ్తున్నాం. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. వర్షాకాలం పాఠశాలకు వెళ్లాలంటే రోడ్డంతా బురదమయంగా ఉంటుంది. అధికారులు స్పందించి రోడ్డు వేయాలి.

– అర్చన, విద్యార్థి, ఎక్కచెరువుతండా

సమస్యను పరిష్కరించాలి

గ్రామాలు ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు తండాలకు రోడ్డు సౌకర్యం లేదు. కొంత కాలంగా సాధారణ రోడ్డును ఏర్పాటు చేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నాం. రెండేళ్ల క్రితం తండాలకు బీటీ రోడ్డు మంజూరయింది. దీనికి కొంతమంది పెత్తందారులు అడ్డుపడుతున్నారు. ఎలాగైన రోడ్డు వేసి గిరిజనుల సమస్యను పరిష్కరించాలి.

– శివనాయక్‌, స్థానికుడు, ఎక్కచెరువుతండా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement