యాలాల: అభివృద్ధి పనుల్లో భాగంగా పంచాయతీలకు నిధుల కేటాయింపుల్లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తీవ్రంగా వివక్ష చూపుతున్నారని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీశైల్‌రెడ్డి ఆరోపించారు. గురువారం చెన్నారం సమీపంలోని మాజీ సర్పంచ్ శివకుమార్ వ్యవసాయ క్షేత్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన ఈజీఎస్ కేంద్ర నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపారన్నారు. మండలంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 14 మంది బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలిచారన్నారు. కాగా ఈజీఎస్ నిధులను బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు ఉన్న గ్రామాలకు ఎమ్మెల్యే కేటాయించకుండా, కేవలం కాంగ్రెస్ సర్పంచ్‌లు ఉన్న గ్రామాలకు మాత్రమే కేటాయించారన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ సర్పంచ్‌లు ఉన్న గ్రామాలకు సైతం ఈజీఎస్ నిధులను కేటాయించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. మండలంలో అభివృద్ధి పనులతో పాటు హైవే పనుల పేరిట ఇసుక, మొరం అక్రమ రవాణా జరుగుతుందని పేర్కొన్నారు. అధికార పార్టీ ఆగడాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తు వేధిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సిద్రాల శ్రీనివాస్, ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ మాజీ సభ్యుడు శివకుమార్, సొసైటీ మాజీ వైస్ చైర్మన్ వడ్డే రాములు, పేర్కంపల్లి సర్పంచ్ నర్సింలు, మాజీ సర్పంచ్‌లు సాయిలు, వెంకటయ్య, నాయకులు ముస్తఫా, శ్రీనివాస్, వెంకటేష్, సుభాన్‌రెడ్డి, క్రిష్ణకుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, రవికుమార్, మల్లేషం, గణేష్, రాంచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీశైల్‌రెడ్డి


