పోలీసుల హైడ్రామా! | - | Sakshi
Sakshi News home page

పోలీసుల హైడ్రామా!

Mar 27 2026 10:13 AM | Updated on Mar 27 2026 10:13 AM

జీపును ఢీకొట్టిన కేసులో ఒకరికి రిమాండ్‌

మిగితా వారిపై నామమాత్రపు చర్యలు

ఎస్‌ఐ శ్రీశైలంపై ఉన్నతాధికారుల ఫైర్‌

బషీరాబాద్‌: పోలీసుల వాహనాన్ని ఇసుక ట్రాక్టర్లతో ఢీకొట్టిన కేసులో హైడ్రామా చోటుచేసుకుంది. ఇసుక మాఫియాతో ‘మామూలు’ బంధాలు నెరిపిన పోలీసులు వారిని కేసులో నుంచి తప్పించడానికి రోజంతా తర్జనభర్జన పడ్డారు. గురువారం ఈ కేసు విషయమై సాక్షిలో ‘అక్రమార్కులతో దాగుడు మూతలు’ శీర్షికన ప్రచురించిన కథనంతో పోలీసు ఉన్నతాధికారులు స్థానిక ఎస్‌ఐ శ్రీశైలం యాదవ్‌ను తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. దీంతో రోజంతా పోలీసు ఠాణాలో ఈ కేసులోని వ్యక్తులు, రాజకీయ నేతలతో చర్చోపచర్చలు జరిపారు. ట్రాక్టర్‌ ఓనర్‌, డ్రైవర్లను వదిలేసి ఓ ట్రాక్టర్‌ ట్రాలీ యజమాని చౌహన్‌ శ్రీనివాస్‌ను నిందితుడిగా తేల్చాడు. గురువారం సాయంత్రం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులో పోలీసు జీపును ఢీకొట్టిన మైనర్‌ బాలుడిని బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

పిట్టి కేసుతో సరిపెట్టి

దామర్‌చెడ్‌కు చెందిన ద్యావరి సురేశ్‌ రెగ్యులర్‌గా ఇసుక వ్యాపారం చేస్తుంటాడు. పోలీసుల అండదండలతో రాత్రివేళ అక్రమ రవాణా జరుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన కేసులో ఉన్న ఇతడిపై పిట్టి కేసు పెట్టి స్టేషన్‌ బెయిల్‌తో వదిలేశారు. అతడి డ్రైవర్‌పైన కూడా నామమాత్రపు చర్యలే తీసుకున్నారు. సదరు వ్యక్తులు తన సామాజికవర్గానికి చెందిన వారు కావడంతోనే ఎస్‌ఐ వారిని చిన్న కేసుతో తప్పించినట్లు దామర్‌చెడ్‌ గ్రామ అధికార పార్టీ నాయకులు ఆరోపించారు.

విలేకరులపై ఎస్‌ఐ కస్సుబస్సు

పోలీసు వాహనాన్ని ఇసుక ట్రాక్టర్‌లతో ఢీకొట్టిన కేసులో నలుగురు నిందితులను గురువారం మధ్యాహ్నం 1.30కి రిమాండ్‌ చేస్తున్నట్లు విలేకరులకు పోలీసువర్గాలు సమాచారం ఇచ్చాయి. అయితే మధ్యాహ్నం 3 గంటలు దాటినా పోలీసులు ఏ విషయం మీడియాకు చెప్పలేదు. రాజకీయ నాయకులు, ట్రాక్టర్‌లకు సంబంధించిన వ్యక్తులతో చర్చలు జరుపుతూ హడావుడి చేశారు. ఈ వార్తను కవర్‌ చేయడానికి ఠాణాలోకి వెళ్లిన విలేకరులపై ఎస్‌ఐ కస్సుబస్సు లాడారు. ‘మీరంతా లోపలికి ఎందుకు వచ్చారు? డోర్‌ దగ్గరే ఉండండి.. తర్వాతా వివరాలు వాట్సాప్‌ గ్రూపులో పెడ్తాం’ అంటూ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఆయన తీరు పట్ల విలేకరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement