వికారాబాద్: లా అండ్ ఆర్డర్ వ్యవస్థ గాడి తప్పుతోంది. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతున్నారు. కట్టడి చేయాల్సిన ఖాకీల నుంచి స్పందన కరువైందనే అపవాదులు వస్తున్నాయి. దొంగతనాలు, రాబరీలు, హత్యలు, అటెన్షన్ డైవర్షన్ కేసులు, చీటింగ్, ఫోన్‌లు, పర్స్‌ల దొంగిలించటం తదితర నేరాల పాటు మూగజీవాల దొంగతనాలు సైతం విపరీతంగా పెరిగిపోయాయి. జిల్లాలో దొంగలు పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. కేసుల ఛేదనలో పోలీసుల వైఫల్యం కొట్టిచ్చినట్టు కనిపిస్తోంది. కాగా పోలీసులు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారనే అపవాదు ఉంది. ఇటీవల జిల్లాలో డిక్కీ అఫెన్సెస్ బాగా పెరిగిపోయాయి. స్థానిక వికారాబాద్ జిల్లా కేంద్రం పీఎస్ ఎస్‌హెచ్‌ఓ చార్జి తీసుకుని నెలలు గడుస్తున్నా ఆయనకు పరిస్థితి ఇంకా అంతుబట్టడంలేదనే టాక్ నడుస్తోంది. ఆయన కింద పనిచేసే ఎస్‌ఐలు సైతం ఆయనకు సహకరించటంలేదనే చర్చలు కొనసాగుతున్నాయి.
నిందితులు ఎవరనే విషయం తెలిసిన నేరాలల్లో మాత్రమే ఎస్‌హెచ్‌ఓలు, ఐఓలు నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నారు. మిగిలిన కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. కొన్ని కేసులు నమోదు కూడా చేయడం లేదు. ఎన్‌ఫోర్స్‌మెంట్, నిఘా వ్యవస్థల వైఫల్యం కూడా నేరాలు పెరగడానికి ఓ కారణమని తెలుస్తోంది. కొన్ని చోట్ల తమకు సంబంధం లేని సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్నారనే ఆరోపణలు పెరిగాయి. కొత్తబాస్ వచ్చిన సమయంలో భయపడుతున్నట్లు వ్యవహరిస్తున్న ఎస్‌హెచ్‌ఓలు తదనంతరం లైట్ తీసుకుంటున్నారు. చన్గోముల్, వికారాబాద్, నవాబుపేట, మోమిన్‌పేట, తాండూరు, ధారూరు, పరిగి, మర్పల్లి, బషీరాబాద్ తదితర ఠాణా పరిధిలో పోలీసులపై సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్నారనే వదంతులు వినిపిస్తున్నాయి. రేషన్ బియ్యం స్మగ్లింగ్, ఇసుక దందా, కలప రవాణా తదితర అంశాలను కట్టడి చేయడంలోనూ వైఫల్యం చెందారనే విమర్శలు వస్తున్నాయి. అప్పుడప్పుడు సీసీఎస్ పోలీసులు కేసులు చేధించడం తప్ప ఎస్‌హెచ్‌ఓలు, ఐఓలు దృష్టి సారించటంలేదనే విమర్శలున్నాయి. తాండూరు సబ్ డివిజన్ పోలీసులు పలు సందర్భాల్లో ఇసుక మాఫియా అంటకాగుతున్నారని ఆ శాఖలో చర్చనీయాంశమయింది. ఇదే విషయాన్ని నిఘా వ్యవస్థల సమాచారంతో ఉన్నతాధికారులు హెచ్చిరిస్తూ వచ్చిన విషయం విదితమే. అయినప్పటికీ వారి తీరులో మారడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
● కుల్కచర్ల, పరిగి, దౌల్తాబాద్, బషీరాబాద్, చన్గోముల్ ఠాణాల పరిధిలో ఇటీవల రాత్రిళ్లు హల్‌చల్ చేస్తూ వందల సంఖ్యలో మేకలు, గొర్రెలు ఎత్తుకెళ్లి రైతులకు రూ.లక్షల్లో నష్టం కలిగించారు.
● పరిగిలో మిషన్ భగీరథ పైపులు దొంగిలించిన నిందితుల నుంచి రికవరీ సమయంలో రూ.లక్షల్లో ఇతరుల ఖాతాల్లో వేసి పోలీసులు కాజేసే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.
● పరిగి, దోమ ఠాణాల పరిధిలో గేదెలను ఎత్తుకెళ్తుండగా కేసులు నమోదు చేసిన చేతులు దులుపుకొన్నారు.
● బంట్వారం, పెద్దేముల్ స్టేషన్ల పరిధిలో పదుల సంఖ్యలో ఆవులు, ఎద్దులను ఎత్తుకెళ్లగా ఇప్పటి వరకు పట్టుకోలేదు.
● కొడంగల్‌లో రైతులు ముత్తూట్ ఫైనాన్స్‌లో డబ్బులు డ్రాచేసుకుని స్కూటీలో పెట్టుకోగా రూ. 2.2 లక్షలు దొంగలు కొట్టేశారు.
● బస్టాండ్‌లు, సంతల్లో చోరీలకు లెక్కే లేకుండా పోయింది. పర్సులు, సెల్‌ఫోన్ల దొంగతనాలు నిత్యకృత్యంగా మారాయి. పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్, తుంకిమెట్ల, మన్నెగూడ తదితర వారాంతపు మార్కెట్లలో ఎక్కువగా జరుగుతున్నాయి.
● ఇటీవల వికారాబాద్ పట్టణంలో జరిగిన ఇళ్ల దోపిడీలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసాయి.
● గతేడాది తాండూరులో ఓ ఇంట్లో 44 తులాలు, మరో ఇంట్లో 15 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురవ్వగా నేటికీ రికవరీ కాలేదు.
● ఇటీవల వికారాబాద్ పట్టణంలో పట్టపగలే ఆటో, స్కూటీ చోరీ గురికావడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది.
జిల్లాలో కొంతకాలంగా నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. వరుస చోరీలు, అఘాయిత్యాలు వెలుగుచూస్తుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. మూగజీవాలను అపహరిస్తూ.. తాళం వేసిన ఇళ్లకు కన్నం వేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
సివిల్ తగాదాల్లో పోలీసులు!
ఇటీవల జరిగిన నేరాలు
రెచ్చిపోతున్న దొంగలు..
పెరిగిన చోరీలు
హడలెత్తుతున్న ప్రజలు
కేసుల ఛేదనలో పోలీసులు విఫలం
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారని ఆరోపణలు