నేటినుంచి స్పర్శ పక్షోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటినుంచి స్పర్శ పక్షోత్సవాలు

Mar 23 2026 10:07 AM | Updated on Mar 23 2026 10:07 AM

సర్వేకు సహకరించాలి

బొంరాస్‌పేట: కుష్టు రహిత సమాజం కోసం కలిసికట్టుగా కృషి చేద్దామని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు సందేశమిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం నుంచి (మార్చి 23) కుష్టువ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు సర్వే చేపట్టానున్నారు. ఈ ఏడాది కుష్టువ్యాధి నిర్మూలన దినంగా దేశవ్యాప్తంగా జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ‘స్పర్శ’ పక్షోత్సవాలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో ఆరోగ్యకార్యకర్తలు, ఆశ వర్కర్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఏడాదికి రెండు సార్లు

వేయి కుటుంబాలకు ఒక ఆశ చొప్పున జిల్లా వ్యాప్తంగా 698 మంది ఆశ కార్యకర్తలున్నారు. వీరు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోజుకు 25 కుటుంబాలు సందర్శించి లెప్రసీ లక్షణాలున్న వారిని గుర్తించాలి. సర్వేలో వ్యాధి లక్షణాలు గుర్తించిన వారిని స్థానిక పీహెచ్‌సీకి పంపాలి. అక్కడ వ్యాధి నిర్ధారణ అనంతరం పూర్తి స్థాయి చికిత్సను అందిస్తారు. ఈ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రతీ సంవత్సరం రెండు సార్లు సర్వే నిర్వహిస్తారు. ప్రస్తుతం నిర్వహించే ఈ సర్వే ఏప్రిల్‌ 6 వరకు కొనసాగుతుందని జిల్లా అధికారులు చెప్పారు.

లక్షణాలు

● చర్మంపై స్పర్శలేని మచ్చలు

● మందమైన మెరిసే జిడ్డుగల చర్మం(ఉబ్బెత్తుగా బత్తాయి తొక్కులాగ ఉండటం)

● చెవులు, వీపుపై, ఎదపై నొప్పిలేని బొడిపెలు

● కనుబొమ్మలు, కనురెప్పలపై వెంట్రుకలు రాలిపోవడం

● కనురెప్పలు మూతపడకపోవడం

● ముక్కు దిబ్బడ, ముక్కులోనుంచి రక్త స్రావం.

● కాళ్లు, చేతులు తిమ్మిర్లు, పాదాలవాపు

● అరచేతులు, అరికాళ్లలో స్పర్శ కోల్పోవడం.

● చల్లని లేదా వేడివస్తువులను

గుర్తించలేకపోవడం.

● చేతుల నుంచి వస్తువులు జారిపోవడం

● కాళ్లకు చెప్పులు జారిపోవడం

● తెలియకుండానే చేతులు, కాళ్లలో

బొబ్బలు రావడం

● చేతివేళ్లు, కాలివేళ్లు వంకర్లు తిరిగి

అంగవైకల్యం రావడం.

ఉచితంగా మందులు

ఆరోగ్యకేంద్రంలోని ఆరోగ్య కార్యకర్తవద్ద ఎండీపీ మందులు ఉచితంగా అందిస్తున్నారు. ఆరునెలలు మందులు వాడితే పూర్తింగా నయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. డీపీఎం, జిల్లాలో పారామెడికల్‌ అధికారులు, పీహెచ్‌సీలను పర్యవేక్షించి వైద్యసేవలు అందించే విధులు నిర్వహిస్తున్నారు. డ్యాప్సోన్‌, క్లోఫోమైజిన్‌అనే మాత్రలు, వ్యాధి తీవ్రతను బట్టి ఆరునెలల నుంచి ఏడాదిపాటు మందులు ఇస్తున్నారు.

కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు ఇంటింటి సర్వే

ప్రతి ఏడాది రెండు సార్లు లెప్రసీపై అవగాహన, సర్వే చేస్తున్నాం. ఇందులో భాగంగా ఆశ కార్యకర్తలతో 14 రోజులపాటు ఇంటింటి సర్వేచేయిస్తున్నాం. గుర్తించిన రోగులను పీహెచ్‌సీకి పంపించి నిర్ధారణ అనంతరం సరైన చికిత్స ఉంటుంది. ఇదివరకు గుర్తించిన 82 మంది రోగులకు ప్రత్యేక పర్యవేక్షణతో వైద్యం అందిస్తున్నాం. – డాక్టర్‌ రవీంద్రయాదవ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, వికారాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement