ఆర్థిక సమస్యలతో రైతు ఆత్మహత్య
మర్పల్లి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ రైతు పురుగు మందు తాగి ఆస్పత్రిలో మృతిచెందాడు. ఈ ఘటన మర్పల్లి మండల పరిధిలోని తిమ్మాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన హరిజన నర్సింలు (45) తనకున్న కొద్ది పాటి భూమిలో వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. రెక్కల కష్టంతోనే ఇద్దరు బిడ్డల వివాహం చేశాడు. కొడుకును హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో చదివిస్తున్నాడు. కూతుళ్ల వివాహాలకు చేసిన అప్పులు, కుమారుడి చదువు కోసం పెడుతున్న ఖర్చులు నర్సింలుకు తలకు మించిన భారంగా మారాయి. ఈక్రమంలో గురువారం సాయంత్రం పొలానికి వెళ్తున్నట్లు భార్య లక్ష్మికి చెప్పాడు. కొద్ది సేపటికే తాను పురుగు మందు తాగానని ఫోన్ చేయడంతో ఆందోళనకు గురై ఆమె స్థానికులను తీసుకుని పొలం వద్దకు వెళ్లగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే వికారాబాద్‌లోని మిషన్ ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు నగరానికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం నర్సింలు మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రవూఫ్ తెలిపారు.


