ఆ పార్టీలకు ఓట్లు వేస్తే.. ఎంఐఎంకి వేసినట్లే
● ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ మాట తప్పింది
● బీజేపీ అధికార ప్రతినిధి, సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి
● తాండూరులో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం
తాండూరు: కాంగ్రెస్.. బీఆర్‌ఎస్ పార్టీలకు ఓట్లు వేస్తే ఎంఐఎం పార్టీకి వేసినట్లేనని బీజేపీ అధికార ప్రతినిధి, సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యూ రమేష్‌కుమార్, యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తాతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాండూరులో ఏ ఇంటికి వెళ్లినా ప్రతి ఒక్కరూ బీజేపీ రావాలి.. కావాలంటున్నారని తెలిపారు. ఓవైసీ బ్రదర్స్ తాండూరుకు వస్తున్నట్లు తెలిసిందని, 40 ఏళ్లుగా హైదరాబాద్‌ను పాలిస్తున్న ఎంఐఎం పార్టీ ఓవైసీ కుటుంబాన్ని అభివృద్ధి చేసిందని ఆరోపించారు. కేవలం మత రాజకీయం చేస్తూ ముస్లిం మైనార్టీలను మోసం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో దోస్తీ చేస్తోందని ఆరోపించారు. మతం పేరుతో ఓట్లు అడిగేందుకు వస్తున్న ఎంఐఎం పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేవుళ్లపై ప్రమాణం చేసి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి నో గ్యారంటీగా మిగిలారన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోచుకుందన్నారు. ఆస్తి తగాదాలతో కుటుంబం గొడవ పడుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మనోహర్‌రావు, అభ్యర్థులు ఇందూర్ రాములు, కృష్ణ ముదిరాజ్, భద్రేశ్వర్, నాయకులు విజయ్‌కుమార్, సాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


