చంపుతారనే భయంతో చంపేశా
● నేరాన్ని అంగీకరించిన నిందితుడు
● వివరాలు వెల్లడించిన ధారూరు సీఐ రఘురామ్
ధారూరు: తన తండ్రిని చంపిన వ్యక్తులు తనను కూడా చంపుతారనే భయంతోనే శంకర్‌నాయక్‌ను హత్యచేసినట్లు హంతకుడు సబావత్ సాయికిరణ్ పోలీసుల విచారణలో అంగీకరించాడని సీఐ రఘురామ్ తెలిపారు. ధారూరులోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాంపూర్‌తండాకు చెందిన శంకర్‌నాయక్, మోహన్‌నాయక్ దాయాదులు. ఆగస్టు 1వ తేదీ, 2025 రోజున మోహన్‌నాయక్ కోడి, దాని పిల్లలు శంకర్‌నాయక్ ఇంట్లోకి వెళ్లాయి. కోడి చనిపోవడంతో మోహన్‌నాయక్ వెళ్లి వాగ్వాదం పెట్టుకున్నాడు. దీంతో కోపోద్రిక్తులైన శంకర్‌నాయక్ అతని భార్య, కొడుకు కలిసి అతనిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మోహన్‌నాయక్ చనిపోయాడు. దీంతో నిందితులు ముగ్గురూ జైలుకు వెళ్లి, బెయిల్‌పై వచ్చారు. గ్రామంలో ఉంటే తమను చంపుతారనే భయంతో శంకర్‌నాయక్ కుటుంబం హైదరాబాద్‌కు మకాం మార్చింది. అయితే, జైలు నుంచి బయటకు వచ్చిన శంకర్‌నాయక్, అతని కొడుకు కలిసి తనను చంపుతారనే భయంతోనే వీరిని చంపేందుకు సాయికిరణ్ పథకం సిద్ధం చేసుకున్నాడు. గత నెల సంక్రాంతి పండుగ సందర్భంగా ధారూరు సంతలో కత్తి కొనుగోలు చేశాడు. ఒంటరిగా పింఛన్ డబ్బుల కోసం వచ్చిన శంకర్‌నాయక్‌ను స్కూటర్‌తో ఢీకొట్టి, కత్తితో గొంతులో పొడిచి హత్య చేశాడు. శుక్రవారం అరెస్టు చేసి కత్తి, స్కూటీని, రక్తపు మరకలతో ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.


