రోహింగ్యా యువకుడి దారుణ హత్య
పహాడీషరీఫ్: బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శరణార్థులుగా నివాసం ఉంటున్న బర్మా దేశస్తుల(రోహింగ్యాలు) క్యాంప్‌లో ఓ యువ కుడు హత్యకు గురయ్యాడు. ఇన్‌స్పెక్టర్ ఎం. సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాయల్ కాలనీలోని బర్మా(మయన్మార్) క్యాంప్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఆ దేశానికి చెందిన ముర్షీద్(19), అబ్దుల్లా (20) మద్యం మత్తులో చిన్న చిన్న విషయాలను మనసులో ఉంచుకొని పరస్పరం దూషించుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన అబ్దుల్లా ఇంట్లోకి వెళ్లి చాకు తీసుకొచ్చి ముర్షీద్ వీపు, మెడ భాగాలలో విచక్షణా రహితంగా 15 పోట్ల వరకు పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న మహేశ్వరం ఏసీపీ జానకీ రెడ్డి, బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌లు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. చిరు వివాదంతోనే 15 కత్తి పోట్లు పొడిచాడా? అనే అనుమానాలు కూడా స్థానికంగా వ్యక్త మవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో వరుసగా జరుగుతున్న ఇలాంటి నేరాల పట్ల స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.


