నిద్రలోనే నూరేళ్లు నిండాయి
● ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం
● దుకాణంలోకి దూసుకెళ్లిన కారు
మైలార్‌దేవ్‌పల్లి: అతివేగం.. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం.. రెండు నిండు ప్రాణాలను బలిగొంది. బతుకుదెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన తండ్రీకొడుకులు అసువులు బాశారు. నిద్రలోనే వారికి నూరేళ్లు నిండాయి. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని దుర్గానగర్ ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై విశ్వనాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ హుస్సేన్ అనే యువకుడు తన స్నేహితులు మరో ఐదుగురితో కలిసి శంషాబాద్ నుంచి ఇన్నోవా కారులో తెల్లవారుజామున తిరిగి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన ప్రభు మహారాజ్ కుటుంబ సభ్యులు దుర్గానగర్ ప్రాంతంలో దుప్పట్లు, రగ్గుల విక్రయ దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రోజు మాదిరిగానే వారు దుకాణంలో నిద్రకు ఉపక్రమించారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో కారు అతివేగంతో వచ్చి అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో నిద్రిస్తున్న ప్రభు మహరాజ్ (60), దీపక్ (25), సంతునాథ్ (27)పై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రభు మహరాజ్, దీపక్ అక్కడికక్కడే మృతి చెందారు. సంతునాథ్‌కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు నడుపుతున్న సయ్యద్ హుస్సేన్ నిద్ర మత్తులో ఉండటంతో పాటు మంచు కురుస్తుండటంతో కారు బీభత్సం సృష్టించిందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


