ఆక్రమణలు తొలగించాల్సిందే
తాండూరు టౌన్: మున్సిపల్ పరిధిలో రోడ్లను ఆక్ర మించి వ్యాపారం చేసుకుంటున్న వారు స్వచ్ఛందంగా వాటిని తొలగించాలని, లేకుంటే తామే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ యాదగిరి హెచ్చరించారు. మూడు రోజుల్లోగా ఆక్రమణల తొలగింపు ప్రక్రియ పూర్తికావాలని ఆదేశించారు. బుధవారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం నుంచి మార్కెట్ వరకు టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని తెలిపారు. వార్డుల్లో విద్యుద్దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి సమస్యల తక్షణపరిష్కారం కోసం సంబంధించిన ఇన్‌చార్జ్‌ల పేర్లు, ఫోన్ నంబర్లను గోడలపై రాశామన్నారు. ఫోన్ చేసి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అయినా పరిష్కారం కాకపోతే నేరుగా కార్యాలయానికి వచ్చి అక్కడి రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలోటౌన్ ప్లానింగ్ అధికారులు వంశీధర్, నరేష్, ప్రియ, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వెంకటయ్య, ఉమేష్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


