ప్రణాళికతో సాగితే ఏదైనా సాధ్యమే
కొడంగల్: విద్యార్థులు ఇష్టంగా చదువుకోవడంతోపాటు లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. శుక్రవారం పట్టణ శివారులోని కస్తూర్బా గాంధీ విద్యాలయం, పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు పలు సూచనలు అందించారు. కేజీబీవీల్లో బాలల మనుగడ, రక్షణ, అభివృద్ధి, భాగస్వామ్యంపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థీ ఉన్నత శిఖరాలను అధిగమించే విధంగా ప్రణాళికతో విద్యను అభ్యసించాలన్నారు. ప్రతి స్టూడెంట్‌కు ఒక కల ఉంటుందని, పట్టుదలతో శ్రమించి దాన్ని సాకారం చేసుకోవాలని తెలిపారు. వివిధ భాషలపై పట్టు సాధించాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలకు మంచి పేరు తేవాలన్నారు.
బాల్య వివాహాల చట్ట విరుద్ధం
వివాహాల విషయంలో చట్టబద్దంగా ఉండాలని, చట్టాలకు వ్యతిరేకంగా బాల్య వివాహాలు చేస్తే ప్రోత్సహించిన వారికి, తల్లిదండ్రులపై చర్యలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. బాల్య వివాహాలు జరుగుతున్న విషయం తెలిస్తే డయల్ 1098కి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతారని తెలిపారు. బాల్య వివాహాలు చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవాలన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థినులు ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకొని ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థినుల కరాటే, నృత్య ప్రదర్శనలు, బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలపై బుర్రకథ ద్వారా వివరించిన విషయాలు ఎంతగానో అలరించాయి. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు కలెక్టర్ బహుమతులు, మెరిటోరియల్ సర్టిఫికెట్లు అందించారు. పట్టణంలోని జెడ్పీ ఉన్నత బాలికల పాఠశాలలో విద్యార్థినులు నిర్వహించిన యంగ్ ఓరేటర్ కల్బ్ మిడ్ ఇయర్ సోకేష్‌ను కలెక్టర్ ప్రతీక్‌జైన్ వీక్షించారు. ఆంగ్ల భాష సంభాషణకు సంబంధించి ఉపాధ్యాయులు, విద్యార్థినులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీడబ్ల్యూ కృష్ణవేణి, డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి, ఏఎంఓ రామ్‌మస్తా, వైఓసీ జిల్లా మేనేజర్ విజయకుమార్, తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీఓ ఉషారాణి, సీడీపీఓ కాంతారావు, కస్తూర్బాగాంధీ ఎస్‌ఓ స్రవంతి, ఎంఈఓ రాంరెడ్డి, జీసీడీఓ శ్రీదేవి, ఉపాధ్యాయలు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.


