రాయితీకి నిబంధనాలు! | - | Sakshi
Sakshi News home page

రాయితీకి నిబంధనాలు!

Nov 15 2025 9:44 AM | Updated on Nov 15 2025 9:44 AM

రాయితీకి నిబంధనాలు!

రాయితీకి నిబంధనాలు!

దోమ: బడుగు, బలహీనవర్గాలకు చెందిన పదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్ష ఫీజు రాయితీకి ఆదాయ నిబంధనలు అడ్డంకిగా మారాయి. విద్యాశాఖలో దశాబ్దాల కాలం క్రితం నాటి నిబంధనలే కొనసాగుతుండటం, ప్రస్తుత పరిస్థితులకు సరిపోవడం లేదు. ఈ విద్యా సంవత్సరమైనా వీటిని సడలిస్తారని ఆశించినా ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులు ఫీజులో రాయితీ పొందలేకపోతున్నారు.

సాధ్యంకాని ఇన్‌కమ్‌ సర్టిఫికెట్లు..

2025– 26 విద్యా సంవత్సరానికి గాను ఇటీవల పరిక్ష ఫీజు షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేయడంతో విద్యార్థులు ఫీజులు చెల్లించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించేందుకు ఈనెల 20వ తేదీ తుది గడువు. ఈ మేరకు ఒక్కో విద్యార్థి రూ.125 చెల్లిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఈమొత్తం మినహాయింపు ఉంది. కానీ ఇది వర్తించాలంటే తల్లిదండ్రుల వార్షికాదాయం సర్టిఫికెట్‌ సమర్పించాలి. పట్టణ ప్రాంతాల్లో రూ.24 వేలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.20 వేలలోపు ఇన్‌కమ్‌ ఉంటేనే అర్హులవుతారు. ప్రస్తుత కాలంలో ఇది ఎవరికీ సాధ్యమయ్యే పనికాదు. నిత్యం కూలీ పనికి వెళ్లేవారికి సైతం రూ.500 నుంచి రూ.1,200 వరకు అందుతోంది. దీంతో రూ.20 వేలలోపు ఇన్‌కమ్‌ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు తహసీల్దార్లు ససేమిరా అంటున్నారు. సంక్షేమ పథకాలు పొందేవారి వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షల వరకు పరిమితి ఉంటుంది. ఈ విషయాన్ని సైతం పరిగణనలోకి తీసుకోని విద్యాశాఖ పాతకాలం నాటి రూల్స్‌నే పాటిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా వచ్చే వార్షిక పరీక్షలకు హాజరయ్యే వేలాది మంది విద్యార్థులు రాయితీకి దూరమవుతున్నారు.

సడలించాలి

టెన్త్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 20 చివరి గడువు. తహసీల్దార్‌ ఇచ్చిన ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌ ప్రకారం ఫీజులో రాయితీ వర్తించడం లేదు. విద్యాశాఖ ఉన్నతాధికారులు నిబంధనలు సడలించి, పేద కుటుంబాలకు న్యాయం చేయాలి.

– సత్యనారాయణ, పదో తరగతి విద్యార్థి, కిష్టాపూర్‌

ఏనాడో సవరించాల్సింది

నిరుపేద, పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ నిబంధనలు ఏనాడో సవరించాల్సింది. గవర్నమెంట్‌ స్కూళ్లలో చదివే వారిలో తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల పిల్లలే ఉంటారు. విద్యాశాఖ ఈ విషయమై దృష్టిసారించాలి.

– వి.తరుణేశ్వరి, పదో తరగతి విద్యార్థి

ఎలాంటి అధికారాలు లేవు

ఫీజు రాయితీకి పాత నిబంధనలే కొనసాగుతున్నాయి. సడలించే అవకాశాలు మా పరిధిలో లేవు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటేనే అది సాధ్యాపడుతుంది. పరీక్షలు రాసే విద్యార్థులు ఫీజు మొత్తాన్ని చెల్లించాల్సిందే. – వెంకట్‌, ఎంఈఓ, దోమ

పేద విద్యార్థులను పట్టించుకోని విద్యాశాఖ

పాతకాలం నాటి నిబంధనలే అమలు

టెన్త్‌ వార్షిక పరీక్షలకు యథావిధిగా ఫీజు చెల్లించాల్సిన దుస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement