తాగునీటి సమస్య పరిష్కారం
దుద్యాల్: మండల పరిధిలోని కుదురుమల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో ఆయా సమస్యలు పరిష్కరించారు. కొంత కాలంగా తాగునీటి ఇబ్బందులు ఉండేదని, బోరు వేసి మోటర్ ఏర్పాటు చేయకపోవడంతో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడేవారన్నారు. సమస్యను గుర్తించిన ఉపాధ్యాయులు రూ.20వేలతో సింగల్ ఫేజ్ మోటర్‌ను ఏర్పాటు చేయించారు. అలాగే బాలుర, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించారు. గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్ ఏర్పాటుకు మరో రూ.30వేలు వెచ్చించారు. వాటన్నింటిని శుక్రవారం దుద్యాల్, దౌల్తాబాద్ మండల విద్యాధికారులు విజయ రామారావు, వెంకట స్వామిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పాఠశాలలో విద్యార్థుల అవసరాలను గుర్తించి ఉపాధ్యాయులు సహకరించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పూర్ణచందర్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కుదురుమల్ల పాఠశాలలో ఉపాధ్యాయుల దాతృత్వం


