హకీంపేట్‌లో సైనిక్ స్కూల్
దుద్యాల్: కొడంగల్ నియోజకవర్గానికి మంజూరైన సైనిక్ స్కూల్, జవహర్‌లాల్ నెహ్రూ నవోదయ పాఠశాల నిర్మాణం కోసం రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ అధికారుల బృందం స్థల పరిశీలన చేసింది. శుక్రవారం వీరు దుద్యాల్, కొడంగల్ మండలాల్లో పర్యటించారు. దుద్యాల్ మండలం హకీంపేట్ వద్ద సైనిక్ స్కూల్ కోసం, కొడంగల్ మున్సిపల్ పరిధిలోని పాతకొడంగల్ వద్ద నవోదయ పాఠశాల కోసం స్థలాలను పరిశీలించారు. హకీంపేట్‌లో ఎడ్యుకేషన్ హబ్‌కు కేటాయించిన 250 ఎకరాల్లో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పాఠశాల నిర్మాణానికి ఎన్ని ఎకరాలు అవసరం అవుతాయనే విషయాలను తెలుసుకున్నారు. త్వరలో పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం చెట్టుపల్లి తండాలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని ఆదేశించారు. సీసీ పద్ధతిలో బోధన చేయాలని ప్రత్యేక అధికారి రాధిక, ఉపాధ్యాయులకు సూచించారు. ఆ తర్వాత పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ అడిషనల్ డైరెక్టర్ రమణకుమార్, జేడీ మదన్‌మోహన్, ఆర్‌జేడీ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు.


