ఉపాధి హామీ పనులకు కితాబు
ఇబ్రహీంపట్నం రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో చేసిన పనులకు కర్ణాటక రాష్ట్రం ప్రజాప్రతినిధులు, అధికారులు కితాబిచ్చారు. శుక్రవారం వారు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్(జాతీయ గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ) కింద శిక్షణ నిమిత్తం మండలంలోని ఎల్మినేడు, తులేకలాన్ గ్రామాల్లో స్థానిక అధికారులతో కలిసి పర్యటించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులను తిలకించారు. నర్సరీలు, కమ్యూనిటీ ప్లాంటేషన్, రోడ్డు పక్కన నాటిన అవెన్యూ ప్లాంటేషన్, మహిళా శక్తి ఉపాధి భరోసా కార్యక్రమంలో నాటుకోళ్ల పెంపకం, షెడ్డు పనులు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. తులేకలాన్‌లో ఉపాధి పథకంతో చేపట్టిన పండ్ల తోటల పెంపకం, నర్సరీ పల్లె ప్రకృతి వనం పనులు చూశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల ద్వారా చేసిన పనులు బాగున్నాయన్నారు. ఎక్కడ లేని విధంగా మొక్కలు నాటే కార్యక్రమం సఫలీకృతం అయిందన్నారు. గ్రామ పంచాయతీలల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో కర్ణాటకలో గ్రామాలను మారుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఐఆర్‌డీ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ కృష్ణాలోహిదాస్, డాక్టర్ అనురాధ, గ్రామీణాభివృద్ధి శాఖ అడిషనల్ డీఆర్‌డీఓ సుభాషిని, ఏపీడీ చరణ్‌గౌతమ్, ఈసీ శ్వేత, ప్లాంటేషన్ మేనేజర్ సంధ్య, ఎంపీడీఓ వెంకటమ్మ, పంచాయతీ కార్యదర్శులు రవీందర్, మల్లేశ్, ఏపీఓ తిరుపతిచారి, ఈసీ రవికుమార్, సాంకేతిక సహాయకులు సునంద, పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో పర్యటించిన కర్ణాటక బృందం


