నేతలకు రోడ్ల సెగ | - | Sakshi
Sakshi News home page

నేతలకు రోడ్ల సెగ

Nov 6 2025 9:49 AM | Updated on Nov 6 2025 9:49 AM

నేతలకు రోడ్ల సెగ

నేతలకు రోడ్ల సెగ

రోడ్డును బాగుచేయాలంటూ ధర్నా

వికారాబాద్‌: చేవెళ్ల బస్సు ఘటన నేపథ్యంలో దెబ్బతిన్న రోడ్లు, ప్రమాదాలపై ప్రజాగ్రహం పెల్లుబుతోంది. తక్షణం రహదారులను బాగు చేయాలంటూ రోడ్లెక్కి నిరసన గళం వినిపిస్తున్నారు. చేవెళ్ల మండలం మిర్జాగూడెం శివారు హైదరాబాద్‌ – బీజాపూర్‌ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్‌ ఢీ కొట్టిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడిన వివిషయం తెలిసిందే. ఈ ఘటన యావత్‌ రాష్ట్రాన్ని కంటతడి పెట్టించింది. పలు రోడ్లు దెబ్బతినడం వల్లే తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏటా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతోంది. మృతుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

విమర్శల వెల్లువ

ఏళ్ల తరబడిగా రోడ్లు మరమ్మతులకు నోచుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నాయకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులు, బాధిత కుటుంబాలను ఓదార్చడానికి వచ్చిన నేతలకు చేదు అనుభవం ఎదురైంది. బాధిత కుటుంబాలు మొహం మీదే నేతలను కడిగేశారు. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నిర్లక్ష్యం వల్లే ప్రజల ప్రాణాలు పోతున్నాయని మండిపడ్డారు. ఓట్లేసి గెలిపించిన అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా రోడ్ల పరిస్థితిపై నిరసనలు.. ఆందోళనలతో జనం కదం తొక్కుతున్నారు. ఈ పాపం మీదే అంటూ నేతలను నిలదీస్తున్నారు. మరో వైపు రోడ్డు వేయకుండా ఎన్‌జీటీ(నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌)లో కేసు వేసి అడ్డు తగిలిన పర్యావరణ వేత్తలను కూడా వదలడం లేదు. కోర్టు స్టేలను సాకుగా చూపి రోడ్డు వేయకుండా తాత్సారం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.

తిలా పాపం.. తలా పిడికెడు

ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలు, మాజీ మంత్రులు పట్నం మహేందర్‌రెడ్డి, సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్లు వింటేనే మండిపడుతున్నారు. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. వీరితో పాటు జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, పైలెట్‌ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌, కొప్పుల మహేశ్‌రెడ్డి, ప్రస్తుత స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, హ్యాట్రిక్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునితారెడ్డిని సైతం టార్గెట్‌ చేస్తున్నారు. కోర్టులో స్టే వెకెట్‌ చేయించేందుకు ప్రయత్నం చేసిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాత్రం సేఫ్‌గా ఉన్నారు. పట్నం మహేందర్‌రెడ్డి జిల్లాలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా, సుదీర్ఘకాలం పాటు మంత్రిగా పని చేశారు.రవాణా శాఖ మంత్రిగా కొనసాగారు. ప్రధాన పార్టీలైన టీడీపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎవరు అధికారంలో ఉన్నా వాటన్నింటిలోనూ ఆయనే ఉన్నారు. సబితారెడ్డి సైతం గతంలో చేవెళ్ల నుంచి ప్రాతినిథ్యం వహించగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ హయాంలో మంత్రిగా పని చేశారు. ఆమె పుట్టినిల్లు తాండూరు కాగా మెట్టినిల్లు చేవెళ్ల మండలంలోని కౌంకుంట్ల గ్రామం. ఇక ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఇప్పుడు బీజేపీ ఇలా అన్నింటిలో పని చేశారు. వీరందరూ ప్రస్తుతం ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు జిల్లాలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

తాండూరు రూరల్‌: తమ గ్రామం నుంచి పెద్దేముల్‌ వరకు ఉన్న రోడ్డును బాగుచేయాలంటూ బుద్దారం ప్రజలు ఆందోళన చేపట్టారు. గ్రామ సమీపంలోని తాండూరు – సంగారెడ్డి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. బుద్దారం నుంచి పెద్దేముల్‌ వరకు రెండు కిలో మీటర్ల రోడ్డు ఉందని, ఇది పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. అడుగుకో గుంత ఉండటంతో ప్రయాణం చేయాలంటేనే భయం వేస్తోందన్నారు. రాత్రి పూట గుంతలు కనబడకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న పెద్దేముల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు సర్ది చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

నేడు గాజీపూర్‌ వద్ద ధర్నా

తాండూరు – సంగారెడ్డి రోడ్డును బాగుచేయాలనే డిమాండ్‌తో గురువారం ధర్నా చేయనున్నట్లు పెద్దేముల్‌ మండలం గాజీపూర్‌ యువకులు తెలిపారు. బుద్దారం – గాజీపూర్‌ గ్రామాల మధ్య మట్టి పోసి వదిలేశారని వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీలకు అతీతంగా ధర్నాలో పాల్గొనాలని వారు కోరారు.

చేవెళ్ల బస్సు ఘటనతో విమర్శల వెల్లువ

అన్ని పార్టీలకూ చేదు అనుభవం

ప్రమాదస్థలి నుంచి వెళ్లిపోవాలని ఆగ్రహం

రోడ్లను బాగుచేయాలంటూ నిరసన గళం

ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement