నేత్రపర్వం.. రథోత్సవం
● వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణం
● అనంతగిరికి పోటెత్తిన భక్తజనం
రథోత్సవంలో పాల్గొన్న భక్తజనం
అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్ట శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం కార్తీక మాస పెద్ద జాతరలో భాగంగా బుధవారం రాత్రి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. వేలాది మంది తరలివచ్చారు. పలువురు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు ఆలయ సమీపంలోని ఉసిరిచెట్టు కింద కార్తీక దీపాలు వెలిగించారు. కుటుంబసమేతంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. రాత్రి 7గంటలకు పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం అంగరంగ వైభవంగా రథోత్సవం సాగింది. భక్తులు స్వామివారి రథాన్ని లాగుతూ ముందుకు సాగారు. ఉత్సవంలో పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.


