ఇది సంక్షేమ ప్రభుత్వం
పరిగి: తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరని, రాష్ట్రాన్ని దేశంలోనే ఆగ్రగామిగా నిలిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం పరిగి పట్టణ పరిధిలోని నజీరాబాద్ తండాలో 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. 400 కేవీ, 33 కేవీ సబ్‌స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో అప్పాజంక్షన్ నుంచి బీజాపూర్ వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం నిధులు విడుదలైనట్లు తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని కోర్టు అడ్డంకులు తొలగించేలా కృషి చేశారన్నారు. త్వరలో ఈ పనులను పూర్తి చేస్తామన్నారు. చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి రామ్మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. పరిగి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే అన్ని వసతులు ఉండాలని, ఇందులో భాగంగానే విద్యుత్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 2,45,777 కుటుంబాలకు, 1,40,193 ఇళ్లకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలోని 27,970 వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు వివరించారు. అనంతరం మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు ప్రభు త్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
జిల్లాకు సాగునీరందేలా చూస్తాం
ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ కొట్లాడి నిధులు తెచ్చుకుంటున్నారు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
పరిగి నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు


