అధైర్యపడొద్దు అండగా ఉంటాం
● ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
● చేవెళ్ల బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత
తాండూరు: ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు బుధవారం తాండూరు ఎమ్మె ల్యే మనోహర్‌రెడ్డి పరిహారం చెక్కులు అందజేశారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరఫున మరో రూ.2 లక్షల చొప్పున రూ.7 లక్షల చొప్పున 13 మంది కుటుంబాలకు అందజేశారు. తాండూరు పట్టణంలోని బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడి షనల్ కలెక్టర్ సుధీర్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీలత, డిప్యూటీ ఆర్‌ఎం సరస్వతి, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్, డీసీసీబీ చైర్మన్ రవిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది
యాలాల: చేవెళ్ల బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్య పడరాదని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని హాజీపూర్, లక్ష్మీనారాయణపూర్, పేర్కంపల్లి గ్రామాల్లో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.7 లక్షల విలువ చేసే చెక్కులను అందించారు. బస్సు ప్రమాదంలో బందెప్ప, లక్ష్మి దంపతులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. అనాథలైన వారి పిల్లలు శివలీల, భవానీల చదువు బాధ్యతలు నేను తీసుకుంటానన్నారు. లక్ష్మీనారాయణపూర్ చెందిన విద్యార్థిని అఖిలారెడ్డి, పేర్కంపల్లికి చెందిన సాయిప్రియ, నందిని, తనూష మృతి తమను ఎంతగానో కలిచివేసిందన్నారు.
సీనియర్లను పంపించండి
తాండూరు రూరల్: తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో సీనియర్ డ్రైవర్లకే విధులు కేటాయించాలని మీర్జాగూడ ప్రమాద మృతురాలు ముస్కాన్‌బేగం తండ్రి చాంద్‌పాషా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం తరఫున చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆర్టీసీ నుంచి ఇవ్వాల్సిన రూ.2 లక్షల చెక్కు ఇచ్చేందుకు కొంత ఆలస్యం కావడంతో ఆసంస్థ అధికారులపై ఎమ్మెల్యే, సబ్‌కలెక్టర్ అసహనం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉత్తమ్‌చందు, రవిగౌడ్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


