భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి
● శిథిల నివాసాల్లో ఉండరాదు
● ఎస్పీ నారాయణ రెడ్డి
● పోలీసు అధికారులకు దిశానిర్దేశం
అనంతగిరి: కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం ఆయన మాట్లాడారు. తమ తమ పోలీస్ స్టేషన్ల పరిధి వాగులు, కుంటలు, చెరువుల నీటి ప్రవాహంపై నిరంతరం దృష్టి పెట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా.. రాకపోకలకు ఆటంకం కలిగించేలా పొంగిపొర్లుతున్న వాగులు, నాలాల ప్రాంతాల్లో రహదారులను మూసివేయాలని పేర్కొన్నారు. నీటి ప్రవాహం వద్దకు ప్ర జలు ఎవరూ వెళ్లకుండా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. శిథిలావస్థ ఇళ్లల్లో నివాసం ఉండొద్దని, తక్షణమే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని కోరారు. ఎవరికై నా ఏదైనా అత్యవసరం ఉండి, పోలీస్ సహాయం అవసరమైతే, వెంటనే ఆయా ఠాణా అధికారులకు కానీ.. డయల్ 100 లేదా లేదా పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 8712670056కు ఫోన్ చేయాలని వివరించారు. ప్రజలందరూ సహకరించి, సురక్షితంగా ఉండాలని ఎస్పీ కోరారు.


