
‘మధ్యాహ్న’ కష్టాలు
భోజనం తయారీకి నిరాకరించిన ఏజెన్సీ మహిళ దగ్గరుండి వంట తయారు చేయించిన ఎంఈఓ, పాఠశాల సిబ్బంది డీఈఓ ఆదేశాలతో సమస్య పరిష్కారం తీరిన విద్యార్థుల ఆకలి
బొంరాస్‌పేట: మధ్యాహ్న భోజనం తయారీకి ఏజెన్సీ మహిళ నిరాకరించింది. ప్రభుత్వం ఇచ్చే డబ్బు సరిపోదంటూ విధులకు డుమ్మా కొట్టింది. దీంతో విద్యార్థులు పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. ఎంఈఓ, పాఠశాల సీహెచ్‌ఎం దగ్గరుండి వంట తయారు చేయించి విద్యార్థుల ఆకలి తీర్చారు. ఈ ఘటన బొంరాస్‌పేట మండలం ఎన్కేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని పాఠశాలలో 120 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఏజెన్సీ మహిళ చిట్టెమ్మ మధ్యాహ్న భోజనం తయారు చేసేది. సోమవారం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు డుమ్మా కొట్టింది. దీంతో స్కూల్ సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి వంట చేసేందుకు రావాలని కోరింది. కూలి గిట్టుబాటు కాదని తాను రానని చిట్టెమ్మ చెప్పింది. విషయం డీఈఓ రేణుకాదేవి దృష్టికి వెళ్లడంతో ఆమె ఎంఈఓ హరిలాల్‌కు ఫోన్ చేసివెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. దీంతో ఎంఈఓ హరిలాల్, క్లస్టర్ హెచ్‌ఎం రవీందర్‌గౌడ్ స్కూల్‌ని సందర్శించారు. ఏజెన్సీ మహిళను పిలిపించాలని సిబ్బందికి సూచించారు. ఆమె రానని చెప్పడంతో హెల్పర్ బువ్వమ్మతో వంట చేయించారు. సమస్య పరిష్కారం కావడంతో పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఎంఈఓ హరిలాల్ మాట్లాడుతూ.. ఈ నెల 19న గ్రామ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పటి వరకు హెల్పర్ బువ్వమ్మతో వంట చేయిస్తామని, సమావేశంలో వంట మనిషి నియామకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. అలాగే ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తామన్నారు. ఏజెన్సీ మహిళ స్థానంలో మరో వంట మనిషిని నియమిస్తామని పాఠశాల కమిటీ చైర్మన్ బసమ్మ, గ్రామ సంఘం ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మహేశ్‌కుమార్, జ్యోతి పరమేశ్వరి పాల్గొన్నారు.